గిట్టుబాటు ధర కల్పించేందుకే కొనుగోలు కేంద్రాలు : వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

గిట్టుబాటు ధర కల్పించేందుకే కొనుగోలు కేంద్రాలు : వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడరూరల్/ చందుర్తి, వెలుగు : రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా వడ్లను నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందాలని సూచించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. చందుర్తిలో 32 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్ వకుళాభరణం శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, ఆత్మ కమిటీ చైర్మన్ ముకుందరెడ్డి, చందుర్తి తహసీల్దార్ భూపతి తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం కుట్రను తిప్పికొడతాం..

ఓట్ల తొలగింపు కుట్రలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రిలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. ఓట్ల తొలగింపునకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, తొలగించిన ఓట్లన్నింటినీ తిరిగి ఓటరు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.  నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించే నిరసన కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక బస్సుల్లో తరలివెళ్తారని తెలిపారు.