పోలీసులను చూసి పరుగులు.. విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి

పోలీసులను చూసి పరుగులు.. విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి


హైదరాబాద్: మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పంట పొలాన్ని పందుల నుంచి రక్షించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నాయి. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని చూసి పారిపోతున్న క్రమంలో విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు శుక్రవారం రాత్రి పెద్ద మంగళారం రెవెన్యూ పరిధిలోని పద్మావతి ఫంక్షన్ హాల్ వెనుక బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ కూర్చున్నారు. అదే సమయంలో అటుగా పోలీస్ పెట్రోలింగ్ మొబైల్ వాహనం రావడంతో విద్యార్థులు అక్కడి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు.పెద్ద మంగళారం గ్రామానికి చెందిన ఓ రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేశాడు. పోలీసులను చూసి పారిపోతున్న క్రమంలో విద్యార్థులు ఆ తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అత్తాపూర్‌కు చెందిన మోక్ష సాయి చరణ్ (20), బల్కంపేటకు చెందిన యశ్వంత్ (20) ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుల వివరాలు సేకరించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.