సీనియర్ నటి వత్సల రాజగోపాల్ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కేరళలోని తిరువనంతపురంలో ఆమె జన్మించారు. పెళ్లి తర్వాత చెన్నైకి వచ్చిన ఆమె క్లర్క్‌గా పనిచేస్తూనే రంగస్థలంపై తన అభిరుచిని కొనసాగించారు. ఆమె నాటక ప్రదర్శనలను చూసిన దర్శకుడు మణిరత్నం'రోజా' చిత్రంలోని అమ్మమ్మ పాత్రతో వెండితెరకు పరిచయం చేశారు.
అప్పటికే ఆమె వయసు అరవై ఏళ్లు. ఆ తర్వాత సతీ లీలావతి, అన్నియన్, మొళి, రిథమ్, విన్నర్, ధామ్ ధూమ్, కళ్యాణ సమయల్ సాదం లాంటి ఎన్నో తమిళ చిత్రాల్లో ఆమె నటించారు. నాలుగు దశాబ్దాలకు పైగా నటిగా కొనసాగిన ఆమె ప్రయాణంలో నాలుగు వందల చిత్రాల్లో నటించారు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వినాయక్ తెరకెక్కించిన 'అదుర్స్' చిత్రంలోని బామ్మ పాత్రతో తెలుగు వారి మనసుల్లో ఆమె చిరస్థాయిగా నిలిచారు. ఎలాంటి పాత్ర పోషించిన సహజత్వానికి దగ్గరగా ఉండే నటనతో ఆ పాత్రకు న్యాయం చేశారామె. సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
