హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల భద్రత పట్ల నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని ఎస్సీ గురుకులాల సంస్థ సెక్రటరి రవి నాయక్ తేల్చిచెప్పారు. పరకాల–ఓగ్లాపూర్‌లోని ఎస్సీ గురుకుల ఇంటర్ విద్యార్థి కార్తిక్ మృతి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైనందుకు ఇద్దరు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ నెల 24న విద్యార్థి కార్తిక్ మృతి చెందిన ఘటనపై చేపట్టిన విచారణ, జోనల్ అధికారి సమర్పించిన సమగ్ర నివేదికను పరిశీలించిన అనంతరం కార్యదర్శి ఈ చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ, మానసిక ఆరోగ్యం, సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్స్పై ఉందని స్పష్టం చేశారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఆనందరావు తగిన స్థాయిలో స్పందించలేదని విచారణలో వెల్లడైన అంశాలను సెక్రటరీ పరిగణనలోకి తీసుకున్నారు.
ఇదే విద్యా సంస్థలో హౌస్‌మాస్టర్‌గా పనిచేస్తున్న ఆర్.వి.శంకర్, జూనియర్ లెక్చరర్ పైనా సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల క్రమశిక్షణ పర్యవేక్షించడం, వారి ప్రవర్తనలో మార్పులు గమనించడం, అవసరమైనప్పుడు కౌన్సెలింగ్ అందించడం, అసాధారణ పరిస్థితులు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం హౌస్‌మాస్టర్ బాధ్యత అన్నారు.
విద్యార్థి కార్తిక్ మృతి ఘటనకు దారితీసిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, హౌస్‌మాస్టర్ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో బాధ్యత ఉల్లంఘించినందుకు ఆర్.వి.శంకర్‌ను కూడా
సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
