- రూ.10 వేల కోట్ల ‘దీపావళి’ వ్యాపారం దెబ్బతింటది
- సోనియా గాంధీకి ఢిల్లీ వ్యాపారుల లేఖ
న్యూఢిల్లీ: రాంలీలా మైదాన్‌లో నవంబర్ 1న ఇండియా కూటమి నిర్వహించనున్న ర్యాలీని వాయిదా వేసుకోవాలని వ్యాపారులు కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి ఢిల్లీ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సీటీఐ) శుక్రవారం లేఖ రాసింది. ర్యాలీ కారణంగా దీపావళి పండుగ సీజన్‌లో తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసింది. ర్యాలీకి సుమారు 10 లక్షల మంది హాజరవుతారని, 15 వేల నుంచి 20 వేల వాహనాలు వచ్చే అవకాశం ఉందని వ్యాపారులు లేఖలో పేర్కొన్నారు. దీంతో ఢిల్లీలోని 20 ప్రధాన హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో రవాణా స్తంభించిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.
ఈ మార్కెట్లలో రోజుకు రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని వెల్లడించారు. చాందినీ చౌక్, సదర్ బజార్, కనాట్ ప్లేస్, ఖారీ బావోలి, కరోల్ బాగ్ తదితర మార్కెట్లకు నిత్యం వేలాది వాహనాల ద్వారా సరుకులు చేరుతుంటాయని వివరించారు. ర్యాలీ కారణంగా అక్టోబర్ 31నుంచే ట్రాఫిక్ ఆంక్షలు, బారికేడ్ల ప్రభావం ఉండొచ్చని, సరుకుల రవాణాకు ఆటంకాలు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాలీని నవంబర్ 10, 11 తేదీల తర్వాత నిర్వహించాలని లేదా బురారీ మైదాన్‌కు తరలించాలని సోనియాను కోరారు. ర్యాలీని తాము వ్యతిరేకించడం లేదని, సీజన్‌లో వ్యాపారాలు దెబ్బతినకుండా చూడాలని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నామని సీటీఐ చైర్మన్ బ్రిజేశ్ గోయల్ తెలిపారు.
ఇయ్యాళ సీఈసీపై కూటమి ‘ప్రజా అభిశంసన’
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై శుక్రవారం ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నిర్వహించాల్సిన ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమం వాయిదా పడింది. ఢిల్లీలో భారీ వర్షం కురవడంతో ఈ ప్రోగ్రామ్‌ను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు రాహుల్ ప్రకటించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఖర్గే నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. వర్షంలో సీనియర్ నేతలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున అన్ని పార్టీల నేతలు ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ వెల్లడించారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలి, సర్‌పై నిరసనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు.
