న్యూఢిల్లీ: చట్టాలు స్పష్టంగాలేని లేదా మౌనంగా ఉన్న టైంలో, న్యాయవ్యవస్థకు రాజ్యాంగమే మార్గదర్శకంగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. టెక్నాలజీ ఎంత మారినా వ్యక్తిగత గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం వంటి ప్రాథమిక సూత్రాలు మారవని అన్నారు. ఢిల్లీ హైకోర్టు 60 ఏండ్ల వేడుకల ప్రారంభోత్సవంలో సీజేఐ మాట్లాడుతూ.. దశాబ్దం క్రితం వరకు ఊహించని సవాళ్లు ప్రస్తుతం న్యాయవ్యవస్థ ముందుకు వస్తున్నాయని చెప్పారు. ఏఐ సృష్టించే కంటెంట్‌కు కాపీరైట్ రక్షణ ఇవ్వవచ్చా, ‘డీప్‌ఫేక్’ వంటి కొత్త సమస్యను చట్టబద్ధంగా ఎలా ఎదుర్కోవాలి, సాంకేతికత పేరిట వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా ఆవిష్కరణలను ఎలా ప్రోత్సహించాలి వంటి అనేక సంక్లిష్టమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
‘ఇలాంటి ప్రశ్నలకు చట్టాల పుస్తకాల్లో వెంటనే సమాధానాలు దొరకకపోవచ్చు. చట్టం మౌనంగా ఉన్నప్పుడు రాజ్యాంగమే మనకు దారి చూపాలి. సాంకేతికత ఎంత మరుతున్నప్పటికీ.. గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం వంటి రాజ్యాంగ హామీలు ఎప్పటికీ మారవు. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు కచ్చితంగా జోక్యం చేసుకోవాలి’ అని ఆయన నొక్కిచెప్పారు.
