భూటాన్లో బద్దలైన మంచు సరస్సు.. ఫ్లాష్ ప్లడ్తో ఉప్పొంగిన మోఛూ నది..బెంగాల్, అస్సాం సరిహద్దుల్లో అలర్ట్

భూటాన్లో బద్దలైన మంచు సరస్సు.. ఫ్లాష్ ప్లడ్తో ఉప్పొంగిన మోఛూ నది..బెంగాల్, అస్సాం సరిహద్దుల్లో అలర్ట్

థింపు/ న్యూఢిల్లీ: నార్త్ వెస్ట్‌‌‌‌‌‌‌‌ భూటాన్‌‌‌‌‌‌‌‌లోని గసా జిల్లాలో ఉన్న ‘షింటాఫు’ అనే మంచు సరస్సు (గ్లేసియల్ లేక్) ఒక్కసారిగా పొంగిపొర్లడంతో భారీ ఎత్తున ఆకస్మిక వరద (ఫ్లాష్ ఫ్లడ్) పోటెత్తింది. మో ఛూ నది ఉప్పొంగి ప్రవహించడంతో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గసా షాచు హాట్ స్ప్రింగ్ కేంద్రం పూర్తిగా కొట్టుకుపోయింది. ముందుగానే స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే స్థానిక సోలార్ సాగునీటి ప్రాజెక్టు పాక్షికంగా దెబ్బతినగా, పునాఖా-గసా హైవేపై భారీగా బురద, రాళ్లు కొట్టుకొచ్చి రాకపోకలు నిలిచిపోయాయి.

భారత సరిహద్దులకు ముప్పు

భూటాన్ నుంచి పోటెత్తిన ఈ వరద నీరు దిగువనున్న సంకోష్ నది ద్వారా భారత్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశిస్తోంది. దీంతో పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల సరిహద్దు జిల్లాలకు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌లోని అలిపుర్‌‌‌‌‌‌‌‌దువార్, జల్‌‌‌‌‌‌‌‌పాయిగురి, డార్జిలింగ్ కొండలు, కూచ్ బెహార్‌‌‌‌‌‌‌‌తో పాటు అసోంలోని ధుబ్రి జిల్లాలో నదీ పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. 

అధికార యంత్రాంగం రంగంలోకి దిగి సహాయక చర్యలకు సిద్ధంగా ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా,  గ్లేసియర్స్ కరిగిపోతున్నప్పుడు వాటి సహజసిద్ధమైన మంచు లేదా మట్టి కట్టల వెనుక భారీగా నీరు నిల్వ ఉండి సరస్సులా మారుతుంది. భూమి ఉష్ణోగ్రతల వల్ల లేదా కొండచరియలు విరిగిపడటం వల్ల ఆ కట్టలు ఒక్కసారిగా తెగిపోతే పెద్ద ఎత్తున నీరు వరదలా ముంచెత్తుతుంది. దీనినే 'గ్లేసియల్ లేక్ ఔట్​బరస్ట్​ ఫ్లడ్ (జీఎల్‌‌‌‌‌‌‌‌ఓఎఫ్‌‌‌‌‌‌‌‌)’  అంటారు.