తుది శ్వాస విడిచేదాకా ప్రజాసేవ చేస్తా: ప్రధాని మోదీ

తుది శ్వాస విడిచేదాకా ప్రజాసేవ చేస్తా: ప్రధాని మోదీ
  • గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని భిల్డీ సభలో ప్రధాని మోదీ
  • రైతులకు కొరత రానివ్వబోమని వెల్లడి

భిల్డీ: ‘‘దేశం కోసం, ప్రజల శ్రేయస్సు కోసమే నా ప్రాణం.. నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకూ ప్రజా సేవలోనే గడుపుతా” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశం ఏదైనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు బాధపడాల్సింది పోయి, ప్రతిపక్షాలు సంబురాలు చేసుకుంటున్నాయని, ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఈమేరకు గుజరాత్​పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శుక్రవారం బనస్కాంత జిల్లా భిల్డీ పట్టణంలో భారత్ బోవైన్ బ్రీడింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (బీబీబీఆర్‌‌‌‌‌‌‌‌సీ) ను ప్రారంభించారు. 

అనంతరం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, మరికొన్నింటికి ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రానికి వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.14 వేల కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా భిల్డీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ‘మోదీ బాప్’ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రతిపక్షాల తీరుపై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా అశాంతి, గందరగోళం సృష్టించేందుకు పథకం రచించాయని ఆరోపించారు. గల్ఫ్ సంక్షోభం వల్ల ఎరువులు దొరకవని, కృత్రిమ కొరత వస్తుందంటూ రైతాంగంలో భయాందోళనలు రేకెత్తించారని ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. 

గ్యాస్ సిలిండర్ల కొరతతో పొయ్యిలు వెలగవంటూ మహిళలను భయపెట్టే యత్నం చేశారని, దేశంలో అల్లకల్లోలం సృష్టించి మోదీని బద్నాం చేయడమే వారి కుట్ర అని దుయ్యబట్టారు. అంతర్జాతీయంగా యూరియా, డీఏపీ తయారీకి అవసరమైన రసాయనాల ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, ఆ భారాన్ని రైతులపై పడకుండా ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యూరియా బస్తా  రూ.3వేల పైమాటే పలుకుతున్నా మన రైతులకు రూ.300 లోపే అందజేస్తున్నామని, రూ.5వేలు దాటిన డీఏపీని రూ.1,350కే అందిస్తున్నామని తెలిపారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, రైతులకు కొరత రానివ్వబోమని తేల్చిచెప్పారు.

అన్నదాతలకు రూ.50 లక్షల కోట్లు..

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 5 కీలక పథకాల ద్వారా దేశవ్యాప్తంగా అన్నదాతలకు ఏకంగా రూ. 50 లక్షల కోట్ల వరకు ఆర్థిక వెన్నుదన్ను లభించిందని మోదీ వెల్లడించారు. సభా వేదిక నుంచే పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడత కింద సుమారు 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18వేల కోట్లకు పైగా నగదును నేరుగా బదిలీ చేశారు. ఇప్పటివరకు రూ.4.5 లక్షల కోట్లకు పైగా చిన్న రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. వీటితోపాటు ఎరువుల సబ్సిడీ కోసం రూ.16 లక్షల కోట్లు, కనీస మద్దతు ధర ద్వారా ధాన్యం, గోధుమ రైతులకు రూ.24 లక్షల కోట్లు, పంటల బీమా కింద రూ. 2 లక్షల కోట్లకు పైగా పరిహారం చెల్లించామని వివరించారు. పీఎం -కుసుమ్ ద్వారా 12 లక్షల సోలార్ పంపులు ఏర్పాటు చేసి రైతుల డీజిల్, విద్యుత్ వ్యయాలను తగ్గించామని తెలిపారు.