100 బస్సుల్లో ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు

100 బస్సుల్లో ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు
  • సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన పీసీసీ చీఫ్, మంత్రి పొన్నం, పలువురు ఎమ్మెల్యేలు
  • ఇప్పటివరకు 7,5‌‌‌‌‌‌‌‌00 మంది తరలివెళ్లారన్న మహేశ్​గౌడ్​​ 
  • రాంలీలా మైదాన సభ రాహుల్ ప్రధాని అవడానికి నాందిగా నిలుస్తుందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సీఈసీ రాజీనామా డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం తలపెట్టిన కాంగ్రెస్ మార్చ్ కు తెలంగాణ నుంచి ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. శుక్రవారం సాయంత్రం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లారు. ఉదయం అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల నుంచి 100 బస్సుల్లో 5 వేల మంది, పలు ట్రైన్లు, ఫ్లైట్లలో మరో 2,500 మంది.. మొత్తం 7,500 మంది ఢిల్లీ బయలుదేరి వెళ్లారని పీసీసీ చీఫ్ ప్రకటించారు. వీరికి అక్కడ భోజన, బస ఏర్పాట్లను మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ చూస్తున్నారని తెలిపారు. మిగతా మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు శనివారం సాయంత్రం వరకు ఢిల్లీ చేరుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. 

కుట్రలో భాగంగానే ట్రైన్లు క్యాన్సిల్​

ఢిల్లీ సభకు వెళ్లకుండా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్ర పన్నారని, ఇందులో భాగంగానే  రైల్వే శాఖ అధికారులు హైదరాబాద్ నుంచి బుక్​చేసిన స్పెషల్ ట్రైన్లను క్యాన్సిల్ ​చేశారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీ తరలివెళ్లారని చెప్పారు. రాంలీలా మైదాన సభ రాహుల్ ప్రధాని అవడానికి నాందిగా నిలవనుందని వెల్లడించారు. సర్ అక్రమాలతో కేంద్రం తీరుపై, ప్రధాని మోదీ వ్యవహారంపై దేశ ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ దేనని, రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు.