అసలే వానల్లేవని ఉడికిపోతున్న హైదరాబాద్ జనాలను అనుకోకుండా వచ్చిన వాన ఆగం చేసింది. ఆఫీసులు, స్కూల్స్ నుంచి తిరిగి వచ్చే వేళ దంచి కొట్టడంతో తిప్పలు పడాల్సి వచ్చింది. మెయిన్ రోడ్లు, గల్లీలు అన్నీ వరదతో నిండిపోవడంతో ట్రాఫిక్ జామ్స్‌కు కారణమైంది. ఐటీ కారిడార్‌తో పాటు పంజాగుట్ట, బేగంపేట్, కృష్ణానగర్, కేబీఆర్పార్క్ సహా చాలా చోట్ల వాహనాలు ముందుకే కదల్లేదు. బస్సుల్లో గమ్యస్థానం చేరడం కష్టమనుకుని మెట్రో ఎక్కేందుకు వెళ్తే స్టేషన్లలో రద్దీతో చుక్కలు చూడాల్సి వచ్చింది. - హైదరాబాద్‌సిటీ, వెలుగు
సున్నం చెరువులో చేరిన వర్షపు నీరు
వర్షంతో మాదాపూర్ సున్నం చెరువుకు జలకళ వచ్చింది. ఇన్‌లెట్ల ద్వారా పెద్దఎత్తున నీరు చేరింది. చెరువులోకి నీరు చేరుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే హైడ్రా ఈ చెరువు అభివృద్ధి చేయగా, త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
