- ఇక్ఫాయ్ వర్సిటీ విద్యార్థులే ఎక్కువ
- పరీక్షల్లో ముగ్గురికి పాజిటివ్
చేవెళ్ల, వెలుగు : చేవెళ్ల మండలం కమ్మెటలోని ఎల్జీ ఫామ్‌హౌస్ లో జరుగుతున్న గాంజా పార్టీని ఎస్‌ఓటీ, చేవెళ్ల పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీలో 108 మంది విద్యార్థులు పాల్గొనగా, ముగ్గురికి గంజాయి పాజిటివ్ వచ్చింది. మన్నన్ అనే వ్యక్తి గతంలో శంకర్పల్లి మండలం దొంతాన్ పల్లిలోని ఇక్ఫాయ్యూనివర్సీటీ(ఐబీఎస్) లో ఫ్రెషర్స్‌డే పార్టీ నిర్వహించాడు. అక్టోబర్30న చేవెళ్ల మండలంలోని ఓ ఫామ్‌హౌస్ లో పార్టీ జరుగుతుందని ఇన్ స్టాలో ప్రచారం చేసి ఒక్కొక్కరి నుంచి రూ.1,000 నుంచి రూ.2,000 వరకు వసూలు చేశాడు.
పార్టీ జరిగే ప్రాంతం వివరాలను గోప్యంగా ఉంచి, డబ్బులు చెల్లించిన వారికి చివరి నిమిషంలో ఫామ్‌హౌస్ లొకేషన్ పంపించాడు. దీనికి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 108 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఇక్ఫా య్ యూనివర్సీటీ(ఐబీఎస్)కి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి ఫామ్‌హౌస్‌పై దాడి చేసి డ్రగ్స్ పరీక్షలు చేయగా, నిర్వాహకుడు మన్నన్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేవెళ్ల సీఐ కట్టా నరేందర్ రెడ్డి వెల్లడించారు.
హెచ్‌సీయూ స్టూడెంట్స్ కు గాంజా...
హైదరాబాద్ : హెచ్‌సీయూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి అమ్ముతున్న నేపాల్‌కు చెందిన బికాష్ సింగ్ అలియాస్ జంగ్ (30)ను ఈగల్ఫోర్స్అధికారులు అరెస్ట్‌చేశారు. 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 29న ఇద్దరు స్టూడెంట్స్‌కు పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్వచ్చింది. వీరిచ్చిన సమాచారంతో జంగ్ ను పట్టుకున్నారు. జంగ్ గౌలిదొడ్డి -గచ్చిబౌలి ప్రాంతంలో సెక్యూరిటీ గార్డు కాగా, యూనివర్సిటీ సౌత్ గేట్ సమీపంలో గంజాయి దందా చేస్తున్నాడు. నిందితుడు గంజాయి కొంటున్న 23 మంది పేర్లు చెప్పగా, అందులో ఏడుగురు విద్యార్థులు ఉన్నట్టు తేలింది.
