- కారుణ్య ఉద్యోగాల్లో అవినీతిఆరోపణలు
- బొగ్గు గనులపై కొనసాగుతున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి విజిలెన్స్ విభాగం పనితీరుపై కార్మికవర్గంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగానే వ్యవహరిస్తూ, ఎవరిపై చర్యలు తీసుకోవాలనుకుంటే వారిపైనే నిఘా పెడుతున్నారనే విమర్శలున్నాయి. మరికొందరి విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా సంస్థలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజాయితీతో సమృద్ధి నినాదంతో..
సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి నవంబర్ 1 వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ‘నిజాయితీతో సమృద్ధి’ అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు. బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లలోని ఉద్యోగులకు అవినీతి నిరోధం, పారదర్శకత, జవాబుదారీతనంపై అవగాహన కల్పిస్తున్నారు. అక్రమాలు జరిగినప్పుడు వెంటనే విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రధాన ఆఫీస్‌లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీవో), జీఎం నేతృత్వంలో విజిలెన్స్ వ్యవహారాలు కొనసాగుతున్నాయి. కొత్తగూడెంలో కార్పొరేట్ ఆఫీస్ ఉంది. ఫిర్యాదు చేసేవారు సరైన వివరాలు, అడ్రస్, ఫోన్ నంబర్ అందించాల్సి ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో ఫిర్యాదుదారుల పేర్లను గోప్యంగా ఉంచుతారు. అవినీతిని అరికట్టేందుకు ముందస్తు నిఘా, విచారణ, అవగాహన అనే మూడు విధానాలతో విభాగం పనిచేస్తోంది.
కేసుల దర్యాప్తులో తీవ్ర జాప్యం?
సింగరేణి విజిలెన్స్ విభాగానికి అందిన అనేక ఫిర్యాదులు, విచారణలు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయనే ఆరోపణలున్నాయి. విజిలెన్స్ క్లియరెన్స్ సకాలంలో రాకపోవడంతో కొందరు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. మారుపేర్ల వ్యవహారంపై ఏండ్ల తరబడి విచారణ కొనసాగడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నాయి. దీర్ఘకాలంగా ఒకే స్థానంలో పనిచేస్తున్న అధికార్లను నిబంధనల ప్రకారం బదిలీ చేయడం లేదనే విమర్శలూ ఉన్నాయి. ఓవర్‌బర్డెన్ (మట్టి) టెండర్లు, బొగ్గు నిల్వల మాయం, సోలార్ ప్రాజెక్టుల కేటాయింపుల్లో అక్రమాల ఆరోపణలపై విజిలెన్స్ వేగంగా స్పందించడం లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. పెద్ద ఆర్థిక లావాదేవీలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), సీబీఐతో విచారణ జరిపించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
పర్చేజ్ విభాగంలో కొనుగోళ్లు, నాసిరకం పనిముట్లు, ఓబీ కాంట్రాక్టులు, యంత్ర పరికరాల కొనుగోళ్లు, టెండర్లు, కాంట్రాక్టుల్లో అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కార్మికులు కోరుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, యాజమాన్య మార్పుల సమయంలో విజిలెన్స్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదనే విమర్శలున్నాయి. ఆధారాలతో ఫిర్యాదులు చేసినా ఉన్నతాధికారుల విషయంలో చర్యలు తీసుకోవడం లేదని విజిల్ బ్లోయర్లు ఆరోపిస్తున్నారు. గతేడాది 200కు పైగా ఫిర్యాదులు అందగా, వాటిలో కొన్ని వ్యక్తిగత కక్షలు, పగతో చేసినవేనని ఆఫీసర్లు భావిస్తున్నట్లు సమాచారం.
కారుణ్య ఉద్యోగాల్లో అవినీతి మరకలు...
సింగరేణిలో మెడికల్ బోర్డు ద్వారా కల్పించే కారుణ్య ఉద్యోగాల వ్యవహారంలో అవినీతి ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. అనారోగ్య కారణాలతో అన్‌ఫిట్ చేయిస్తామని డబ్బులు వసూలు చేయడం, రాంగ్ డాక్యుమెంట్స్ సృష్టించడం వంటి కేసుల్లో విచారణ జరిపి ఇప్పటివరకు పది మంది ఉద్యోగులను విధుల నుంచి డిస్మిస్ చేశారు. ఈ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న దళారులు, ఇతర బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి.
విజిలెన్స్ చర్యలు ఎక్కువగా కింది స్థాయి ఉద్యోగులు, అధికారులకే పరిమితమవుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా మైనింగ్, ఈఅండ్‌ఎం విభాగాల అధికారుల మధ్య ఉన్న పరిచయాలు, హోదాపరమైన వ్యత్యాసాలు విచారణలపై ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్మికుల విషయంలో మాత్రం డిమోషన్, ఇంక్రిమెంట్ల కోత, డిస్మిస్ వంటి కఠిన చర్యలకు సిఫారసు చేస్తున్నారని కార్మికవర్గం పేర్కొంటోంది. ఏటా విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహించడం, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించడం మాత్రమే సరిపోదు. సింగరేణిలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే విజిలెన్స్ విభాగానికి మరింత స్వయంప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం ఉంది. కేవలం అవగాహన కార్యక్రమాలకే పరిమితం కాకుండా, ఆచరణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా విజిలెన్స్ విభాగం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
