ఖమ్మం: హత్య కేసులో నిందితులు బెయిల్ పై వచ్చి మళ్లీ హత్య

ఖమ్మం: హత్య కేసులో నిందితులు బెయిల్ పై వచ్చి మళ్లీ హత్య
  •  నిందితులపై నిఘా లేకపోవడం వల్లే మరో హత్య జరిగిందని విమర్శలు

ఖమ్మం, వెలుగు:  సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసు ఏడాది తర్వాత కొలిక్కి రావడంతో కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి. నాలుగేండ్ల కింద ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో జరిగిన తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులుగా ఉన్నవారే రామారావు హత్యకు పాల్పడడం సంచలనంగా మారింది. 2022 ఆగస్టు 15న కృష్ణయ్యను కత్తులతో నరికి చంపిన కేసులో పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. అదే ఏడాది డిసెంబర్ లో వారంతా బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత ల్యాండ్ ఇష్యూకు సంబంధించి చౌటుప్పల్ దగ్గర వారిలో కొందరిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఇప్పుడు గతేడాది చింతకాని మండలం పాతర్లపాడులో సామినేని రామారావు హత్య కేసులోనూ వీరిపేర్లు తెరపైకి వచ్చాయి. 

ఏడాది పాటు వివిధ కోణాల్లో చేసిన ఎంక్వైరీ చేసిన పోలీసులు గురువారం నలుగురిని అరెస్ట్ చేశారు. కృష్ణయ్య హత్య కేసులో ఏ1గా ఉన్న బోడపట్ల శ్రీనివాస్​ అలియాస్​ మెంటల్​శ్రీను, రామారావు హత్యకేసులోనూ ఏ1గా ఉన్నారు. ఏ3గా ఉన్న నూకల లింగయ్య తాజా కేసులో ఏ2గా, ఏ7గా ఉన్న మల్లారపు లక్ష్మయ్య ఏ3గా ఉన్నారు. వీరితో పాటు కర్లపూడి ఉదయ్ అలియాస్ రుక్మన్ ను కూడా పోలీసులు అరెస్ట్ అయ్యారు. నిందితులంతా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన వారు. రామారావు సీపీఎంలో కీలక నేత కాగా, నిందితులు కూడా అదే పార్టీలో కార్యకర్తలుగా ఉన్నారు. రాజకీయ, ఆర్థిక కారణాలతోనే రామారావు హత్య జరిగినట్లు నిందితుల అరెస్ట్​ సందర్భంగా సీపీ సునీల్ దత్ చెప్పారు. అయితే హత్యకు దారితీసిన అసలు కారణాలపై స్పష్టత రాలేదు. 

పోలీసుల నిఘాపై విమర్శలు..

గతంలో హత్యకేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారు బెయిల్​పై బయటకు వచ్చి, ఇతర జిల్లాల్లో ల్యాండ్ పంచాయిల్లోనూ ఇన్​వాల్​ అయినప్పటికీ వారిపై సరైన నిఘా లేకపోవడంతోనే మరో హత్య జరిగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీస్​ ఉన్నతాధికారులు మాత్రం రౌడీ షీటర్లు, హ్యాబిచ్యుయల్​ అఫెండర్లపై నింతరం నిఘా ఉంటుందని చెబుతున్నారు.