‘సర్’పై తప్పుడు ప్రచారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు

‘సర్’పై తప్పుడు ప్రచారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు

సిద్దిపేట టౌన్, రూరల్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ ఓట్ల తొలగింపు పేరుతో కేంద్ర ప్రభుత్వంపై, ఎలక్షన్ కమిషన్ పై తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతోందని మెదక్​ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆరోపించారు. శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలోని రైతు వేదికలో రైతులతో కలిగి పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం బీజేపీ జిల్లా ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘సర్’లో ఎంతో మంది ఓట్లు గల్లంతు అయ్యాయని ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లిలో ఎన్ని ఓట్లు పోయాయో చూద్దాం..  కాంగ్రెస్ నాయకులు రావాలన్నారు. 

ఫైనల్ ఓటర్ లిస్టు రాకముందే ఓట్లు పోయాయి అని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. పొన్నాల సర్పంచ్ తో మాట్లాడితే ఓట్లు చనిపోయిన వారివి మాత్రమే తొలగించారని, 20 మందికి మాత్రమే నోటీసులు వచ్చాయని చెప్పారన్నారు. ఈవీఎంల మీద ఏడ్చిన కాంగ్రెస్ బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన సీట్లు ఎన్ని అని నిలదీశారు. పోలీసుల దెబ్బలకు భయపడొద్దని రాహుల్ పిలుపునిస్తున్నారంటే, యువతను చట్ట వ్యతిరేక పనులు చేయమనడమేనని, దేశంలో హింసను ప్రేరేపించి బొద్దింకలను కలుపుకొని దేశంలో అలజడి సృష్టించాలని ఆయన ప్రయత్నించడమేనని ఆరోపించారు. 

అనంతరం ఉద్యోగ భద్రతతో పాటు జీతాల పెంపు కోసం నిరవధిక సమ్మె చేస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు ఎంపీ రఘునందన్ రావు మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, టౌన్ ప్రెసిడెంట్ బాసంగారి వెంకట్, సంతోష్, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.