భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక విజయాన్ని అందుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం (అక్టోబర్ 30) రాత్రి 11:51 గంటలకు GSLV F 18రాకెట్ ద్వారా NVS03శాటిలైట్ ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించారు. ఇది భారతదేశ GSLV రాకెట్‌కు 20వ ప్రయోగం కావడం విశేషం.
ఈ ప్రయోగం ద్వారా భారత్ సొంతంగా అభివృద్ధి చేసుకున్న నావిక్ (NavIC) ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థలో కేవలం మూడు ఉపగ్రహాలు మాత్రమే పొజిషనింగ్, నావిగేషన్, సమయ సమాచారాన్ని అందిస్తున్నాయి. స్వతంత్రంగా స్థానాన్ని గుర్తించేందుకు కనీసం నాలుగు ఉపగ్రహాలు అవసరం. ఈ క్రమంలో NVS 03ప్రయోగం కీలకంగా మారింది.
నావిక్(NavIC) అంటే..?
నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. ఇది భారత్ సొంతంగా రూపొందించుకున్న ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ. దీని ద్వారా మన దేశంతో పాటు సరిహద్దులకు అవతల సుమారు 15వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు స్థాన గుర్తింపు, దిశ, సమయ సమాచారాన్ని అందించవచ్చు. అమెరికాకు చెందిన GPS తరహాలోనే ఇది పనిచేస్తుంది. అయితే జీపీఎస్ ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తే, నావిక్ ప్రధానంగా భారత్, చుట్టుపక్కల ప్రాంతాల కోసం రూపొందించారు.
నావిక్ ఎలా ఉపయోగపడుతుంది?
రైళ్ల కదలికలను గుర్తించడం, చేపల వేట పడవలకు దిశానిర్దేశం చేయడం, వాహనాల ట్రాకింగ్, మొబైల్ ఫోన్లలో లొకేషన్ గుర్తించడం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం వంటి అనేక అవసరాలకు నావిక్ ను పనిచేస్తుంది.
NVS 03ప్రత్యేకత..?
ఈ ఉపగ్రహంలో స్వదేశీ అణు గడియారాలను అమర్చారు. ఇవి అత్యంత కచ్చితమైన సమయాన్ని అందించడంలో సహాయపడతాయి. అలాగే ఇప్పటికే ఉన్న ఎల్5, ఎస్ బ్యాండ్ సిగ్నళ్లతో పాటు కొత్తగా ఎల్1 సిగ్నల్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో నావిక్‌కు మద్దతిచ్చే పరికరాల వినియోగం మరింత విస్తరించే అవకాశం ఉంది.
ఎన్వీఎస్-03 ప్రయోగం భారత్ సొంత నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక ముందడుగు. భవిష్యత్తులో విదేశీ నావిగేషన్ వ్యవస్థలపై ఆధారపడకుండా స్వతంత్రంగా సేవలు అందించేందుకు ఇది దోహదపడనుంది.
