మీ కడుపులో ప్రయాణించే రోబో స్నేక్.. చిన్న పేగుల పరీక్షకు MIT సైంటిస్టుల రూపకల్పన

మీ కడుపులో ప్రయాణించే రోబో స్నేక్.. చిన్న పేగుల పరీక్షకు MIT సైంటిస్టుల రూపకల్పన

వాషింగ్టన్: మీ పేగుల్లో ఒక చిన్న రోబోట్ పాము పాకుతూ అనారోగ్య సమస్యల మూలాల కోసం వెతుకుతున్నట్లు ఊహించుకోండి. వినడానికి కాస్త భయంగా అనిపించినా నిజానికి ఇది మీకు రాబోయే పెద్ద అనారోగ్య సమస్యలను తొలగించడంలో వైద్యులకు సాయపడుతుంది. దాదాపు 20 అడుగుల పొడవున్న ఈ పేగుల లోపల వైద్య పరీక్షలు నిర్వహించడం చాలా కష్టమైన ప్రక్రియ.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో బెలూన్ సహాయక ఎండోస్కోప్‌‌‌‌‌‌‌‌ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. 

అయితే, ఇది చాలా సమయం తీసుకుంటుంది. దీంతోపాటు క్లిష్టమైన ప్రక్రియ. ఈ క్రమంలోనే ఈ పరీక్షను సులువుగా మార్చేందుకు ఎంఐటీ పరిశోధకులు ఓ మృదువైన, పామును పోలిన రోబోట్‌‌‌‌‌‌‌‌ ‘బయోసెంట్ర్’ను అభివృద్ధి చేశారు. దీని రూపకల్పనలో పాముల కదలికలను, వాటి పొలుసుల చర్మం నుంచి పరిశోధకులు ప్రేరణ పొందారని ఎంఐటి తెలిపింది. ఈ రోబోట్‌‌‌‌‌‌‌‌లో ఇమేజింగ్ కోసం కెమెరా, డ్రగ్ డెలివరీ కోసం స్ప్రేయర్, కణజాల బయాప్సీలు తీసుకోవడానికి లేదా పాలిప్స్‌‌‌‌‌‌‌‌ను తొలగించడానికి వీలైన క్లిప్‌‌‌‌‌‌‌‌లతో సహా వివిధ పరికరాలు ఉన్నాయని వివరించింది. ప్రత్యేకమైన డిజైన్ కారణంగా పేగులోని మ్యూకోసల్ లైనింగ్‌‌‌‌‌‌‌‌కు రోబోట్ అతుక్కుని ప్రయాణిస్తుందని పేర్కొంది. 

చిన్న పేగు లోపల తొలగించాల్సిన చిన్న పాలిప్ ఏదైనా కనిపిస్తే బయాప్సీ తీసుకోవడానికి లేదా దానిని తొలగించడానికి ఈ రోబోట్ ఉపయోగపడుతుందని ఎంఐటి మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, బ్రిగమ్ అండ్ విమెన్స్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయిన జియోవన్నీ ట్రావర్సో చెప్పారు. పందుల ప్రేగులలో జరిపిన పరీక్షలలో, ఈ చిన్న పాము రోబోట్ దాదాపు ఆరున్నర అడుగులు ప్రయాణించి.. తన ఇమేజింగ్, బయాప్సీ మరియు డ్రగ్-డెలివరీ సామర్థ్యాలను విజయవంతంగా ప్రదర్శించింది.