- ఆయన్ను ఆ ప్రాజెక్టు గేట్లకు కట్టేసి కొట్టినా తప్పులేదు: ఈరవత్రి అనిల్
హైదరాబాద్, వెలుగు: హరీశ్ రావు ధనదాహం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి పట్టిందని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ఆరోపించారు. ఆయన్ను కాళేశ్వరం గేట్లకు కట్టేసి కొట్టినా, గోల్కొండ కోటకు ఉరేసినా తప్పులేదని వ్యాఖ్యానించారు. శుక్రవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ..మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ సభ్యుడు సమీర్ కుమార్ శుక్లా స్పష్టమైన నివేదిక ఇచ్చారని తెలిపారు.
తొలుత స్టిల్లింగ్ బేస్ మరమ్మతులు చేయాలని టెక్నికల్ కమిటీ భావించిందని, అయితే అధ్యయనం తర్వాత ప్రాజెక్టు నిర్మాణంలోనే నాణ్యత లోపాలున్నట్లు తేలడంతో మరమ్మతులు ఆపేయాలని ఎన్డీఎస్ఏ సూచించిందని గుర్తుచేశారు. బ్యారేజీలను నిర్మించాల్సిన చోట కాకుండా మరోచోట నిర్మించారని, అక్కడ కూడా సాంకేతిక నిబంధనలు పాటించలేదని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిందన్నారు.
బీఆర్ఎస్ చేసిన తప్పిదాలకు సీఎం రేవంత్ రెడ్డిని బాధ్యుడిని చేస్తున్నారని విమర్శించారు. ‘గేట్లు తెరిచి ఉంచాలని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పింది. నీళ్లు ఎత్తిపోయాలని బీఆర్ఎస్ అంటున్నది. మరి ప్రభుత్వం ఎవరి మాట వినాలి?’ అని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ కంటే బీఆర్ఎస్ నేతలు గొప్ప మేధావులా అని నిలదీశారు.
