మియాపూర్ భూముల్లో 400 ఎకరాలు స్వాధీనం..ఇండ్లు కట్టుకున్నోళ్లు భయపడొద్దు.: సీఎం రేవంత్

మియాపూర్ భూముల్లో 400 ఎకరాలు స్వాధీనం..ఇండ్లు కట్టుకున్నోళ్లు భయపడొద్దు.: సీఎం రేవంత్
  • మిగిలిన 150 ఎకరాల్లో కొన్ని కాలనీలు, ఇండ్లు 
  • ఇండ్లు కట్టుకున్నోళ్లు భయపడొద్దు.. ఇప్పటికే ఖాళీ జాగా చుట్టూ ఫెన్సింగ్ వేశాం
  • అక్రమార్కుల ఆటలు సాగనివ్వం: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

 

హైదరాబాద్/మియాపూర్, వెలుగు:  మియాపూర్‌‌లో ఖాళీగా ఉన్న సుమారు 400 ఎకరాల సర్కారు భూమిని అధికారికంగా స్వాధీనం చేసుకుంటున్నామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె.నారాయణరెడ్డి వెల్లడించారు. మిగిలిన భూమిలో ఇప్పటికే ఇండ్లు కట్టుకుని ఉంటున్నవాళ్లు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మియాపూర్‌‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని 550 ఎకరాల 39 గుంటల భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ విలువైన ఆస్తిని దక్కించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శుక్రవారం రెవెన్యూ, సర్వే, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులతో కలిసి ఆయన మియాపూర్ భూములను స్వయంగా పరిశీలించి మీడియాతో మాట్లాడారు.

‘ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ ఖాళీగా ఉన్న భూమిని అధికారికంగా స్వాధీనం చేసుకుంటున్నాం. ఈ 550 ఎకరాల్లో సుమారు 400 ఎకరాలు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. దాని చుట్టూ ఇప్పటికే ఫెన్సింగ్ వేశాం. మిగతా ప్రాంతంలో కొన్ని కాలనీలు, ఇండ్లు ఉన్నాయి. ఇండ్లు కట్టుకుని ఉంటున్నవాళ్లు, నిర్మాణాలు చేసుకున్నవాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలందరికీ స్పష్టంగా చెబుతున్నా. ప్రస్తుతం మేం ఎలాంటి నిర్మాణాల జోలికీ వెళ్లడం లేదు. సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దన్నదే ప్రభుత్వ ఉద్దేశం. నివాసాలు ఉన్న ప్రాంతాలకు చట్టపరంగా ఎలాంటి పరిష్కారం చూపాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది’ అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ భూమి 2003లోనే హెచ్ఎండీఏకు అలాట్ అయిందని, ఖాళీ జాగాను కాపాడేందుకు సుప్రీంకోర్టు అనుమతితోనే 2024 మే, జూన్ నెలల్లో ఫెన్సింగ్ వేశామని కలెక్టర్ తెలిపారు. ఇంకా 150 నుంచి 200 మీటర్లు మాత్రమే పెండింగ్ ఉందని, దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆక్రమణలకు పాల్పడితే గూగుల్ ఎర్త్, శాటిలైట్ రికార్డుల ద్వారా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమార్కుల ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు.

1912 సేత్వార్‌లోనే ‘సర్కార్ పోరంబోకు’

ఈ భూమికి సంబంధించిన మూల రికార్డులన్నీ పరిశీలిస్తే 1912 నాటి సేత్వార్ (సెటిల్‌మెంట్ రికార్డ్)లోనే ‘సర్కార్ పోరంబోకు’ అని స్పష్టంగా ఉందని కలెక్టర్ చెప్పారు. ‘నిజాం పాలనలో సైన్యాన్ని నిర్వహించేందుకు మియాపూర్ గ్రామాన్ని జాగీరుగా కేటాయించారు. ఆ భూమిపై వచ్చే ల్యాండ్ రెవెన్యూతో సైన్యాన్ని పోషించేవారు. స్వాతంత్ర్యం వచ్చాక 1949లోనే జాగీర్దారీ రద్దు చట్టం వచ్చింది.

దాని ప్రకారం జాగీర్ గ్రామాలన్నీ రద్దయి ప్రభుత్వంలో విలీనమయ్యాయి. అప్పుడే జాగీర్దారుకు ప్రభుత్వం రూ.1,20,000 కమ్యుటేషన్ (నష్టపరిహారం) అవార్డు చేసి చెల్లించింది. దీంతో ఆ భూములపై ఎవరికీ ఎలాంటి హక్కులూ మిగల్లేదు. కానీ 1950 నుంచి 1953 మధ్య ఎలాంటి ప్రొసీడింగ్స్, మ్యుటేషన్ ఆర్డర్లు, ఫైసల్ పట్టీలు, సేల్ డీడ్‌లు లేకుండానే కొందరు అప్పటి అధికారులతో కుమ్మక్కై పహాణీల్లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లు అక్రమంగా ఎక్కించుకున్నారు. రికార్డులు తారుమారు చేసి రాసుకున్నంత మాత్రాన హక్కులు రావని, గతంలో హైకోర్టు, ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఇచ్చిన తీర్పులే సరైనవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది’ అని కలెక్టర్ వివరించారు