- కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు నుంచి తన పేరును తొలగించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. డిశ్చార్జ్ పిటిషన్ ను పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి ఏసీబీకి నోటీసులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.
కాగా, కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని ఏసీబీ తరపున స్పెషల్ పీపీ కోర్టును కోరారు. కోర్టు విచారణకు ప్రధాన నిందితుడు కేటీఆర్ పలు కారణాల చేత హాజరు కాలేదు. ఈ మేరకు ఆయన తరుపు న్యాయవాదులు ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటీషన్ ను కోర్టు అనుమతించింది.
రెండో నిందితుడు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, మూడో నిందితుడు హెచ్ ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డితో పాటు స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర రావులు కోర్టుకు హాజరయ్యారు. ఈ మేరకు తదుపరి విచారణను న్యాయమూర్తి డిసెంబర్ 4కు వాయిదా వేశారు.
