- ఓయూ రిజిస్ట్రార్ నరేశ్ రెడ్డి
ముషీరాబాద్, వెలుగు : అంబేద్కర్ దార్శనికత,- సమకాలీన భారతదేశం, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి, రాజ్యాంగ ప్రజాస్వామ్యం అనే అంశంపై బాగ్ లింగంపల్లిలోనే అంబేద్కర్ విద్యాసంస్థల్లో రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ సరోజ వివేక్ తో కలిసి ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.నరేశ్ రెడ్డి ప్రారంభించారు. నరేశ్‌రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి ప్రాంత ప్రజలకు, రాజ్యాంగ అభివృద్ధికి కాకా వెంకటస్వామి, ఆయన కుటుంబం చేసిన సేవలను ప్రశంసించారు.
గత 50 ఏళ్లలో కాకా విద్యా సంస్థలు చేస్తున్న సేవలు గొప్పవని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆ కుటుంబం చేసిన త్యాగం మరువలేనిదని కొనియాడారు. సరోజ వివేక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో, సమకాలీన భారతదేశంలో సామాజిక పరివర్తనను ప్రోత్సహించడంలో అంబేద్కర్ దూరదృష్టిని ఈ సెమినార్ హైలెట్ చేసిందన్నారు. గుల్బార్గా యూనివర్సిటీ రిటైర్డ్ సీనియర్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రకాంత్ ఎం యాతనూర్, పరిశోధన కేంద్రం డైరెక్టర్, సదస్సు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. లింగప్ప పాల్గొన్నారు.
