- ముందుగా ట్రయల్ రన్
- నవంబర్ 26 నుంచి 28 వరకు టీ-హబ్‌లో చర్చా వేదిక
- సైబరాబాద్ మూవ్స్ పోస్టర్ ఆవిష్కరించిన మున్సిపల్కమిషనర్, సీపీ
హైదరాబాద్ సిటీ/ మాదాపూర్, వెలుగు: సైబరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ‘సైబరాబాద్ మూవ్స్–2026’ పేరుతో విన్నూత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మాదాపూర్ న్యాక్‌లోని సీఎంసీ హెడ్ ఆఫీసులో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎంసీ కమిషనర్ సృజన, సైబరాబాద్ సీపీ రమేష్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సంయుక్తంగా ‘సైబరాబాద్ మూవ్స్–2026’ పోస్టర్ ఆవిష్కరించారు. కమిషనర్ సృజన మాట్లాడుతూ సీఎంసీ పరిధిలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్లు, నిపుణుల ప్రసంగాలు, చర్చలు, మొబిలిటీ ఇన్నోవేషన్ ఛాలెంజ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, రవాణా రంగ నిపుణులు పాల్గొని ట్రాఫిక్, రవాణా సమస్యల పరిష్కారాలపై చర్చించనున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణకు సంబంధించి ‘సైబరాబాద్ మూవ్స్ డిక్లరేషన్’ను కూడా రూపొందిస్తామన్నారు. సీపీ రమేశ్మాట్లాడుతూ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పలుచోట్ల వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఇప్పటికే దీనిపై అధ్యయనం చేపట్టినట్లు వెల్లడించారు. ముందుగా ట్రయల్ రన్ నిర్వహించి వాహనదారులకు అవగాహన కల్పించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అందుకే నవంబర్ 26, 27, 28 తేదీల్లో మాదాపూర్‌లోని టీ-హబ్‌లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
వన్ వేపై అధ్యయనం..
విశాలమైన రహదారులు ఉన్నప్పటికీ నిత్యం ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయని, వాహనాలు నిరంతరాయంగా కదిలేలా వస్వి విధానంపై అధ్యయనం చేస్తున్నామని సీపీ తెలిపారు. ఐడియా, మైండ్ స్పేస్, రహేజా, కేబుల్ బ్రిడ్జి, శిల్పా రామం ప్రాంతాల్లో కేబీఆర్ పార్క్ తరహాలో వస్వే విధానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ డేటా ఆధారంగా సిమ్యులేషన్ నిర్వహించి, వివిధ సంస్థలతో చర్చించినతర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అవసరమైన సివిల్ పనులు పూర్తి చేసి, మూడు రోజుల ట్రయల్ రన్ అనంతరం అమలు చేస్తామన్నారు.
74 కీలక జంక్షన్లపై ప్రత్యేక దృష్టి..
సైబరాబాద్ పరిధిలోని కీలక జంక్షన్ల అభివృద్ధితో పాటు కమర్షియల్ భవనాల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల నిర్వహణపైనా దృష్టి సారిస్తున్నట్లు సీపీ తెలిపారు. జంక్షన్ల అభివృద్ధి, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు, పాదచారులకు మెరుగైన సౌకర్యాలు, ప్రజా రవాణా అనుసంధానం వంటి అంశాలకు ప్రాధాన్యమివ్వనున్నట్లు పేర్కొన్నారు. సైబరాబాద్ మూవ్స్ లో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటామని, బొగోటా మేయర్, ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ చీఫ్ టెక్నికల్ అధికారి సహా అంతర్జాతీయ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సీపీ వెల్లడించారు. డబ్ల్యూఆర్ఐ సహకారంతో ట్రాఫిక్ పోలీసులకు, మున్సిపల్ సిబ్బందికి రహదారి భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
