వర్షంతో ఢిల్లీకి జస్ట్ 5 రోజులే ఊరట..ఆ తర్వాత యథావిధిగా కాలుష్యం..అమృత విశ్వవిద్యాపీఠం అధ్యయనంలో వెల్లడి

వర్షంతో ఢిల్లీకి జస్ట్ 5 రోజులే ఊరట..ఆ తర్వాత యథావిధిగా కాలుష్యం..అమృత విశ్వవిద్యాపీఠం అధ్యయనంలో వెల్లడి
  • అమృత విశ్వవిద్యాపీఠం అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: భారీ వర్షం కురిస్తే గాల్లో పేరుకుపోయిన దుమ్ము, పొగ కొట్టుకుపోయి ఢిల్లీలో వాతావరణం కాసేపు స్వచ్ఛంగా మారుతుంది. కానీ, ఆ ఊరట ఎంతోసేపు ఉండడంలేదు. వర్షం తగ్గిన కేవలం ఐదు రోజుల్లోనే గాలి మళ్లీ పాత కాలుష్యపు స్థాయికి చేరిపోతోందని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. కేరళకు చెందిన అమృత విశ్వ విద్యాపీఠం పరిశోధకులు గాయత్రి బాలచంద్రన్, డాక్టర్ సుమిత్ సతీంద్రన్ దాదాపు 22 ఏళ్ల (2003–-2024) ఉపగ్రహ సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ నిజాన్ని బయటపెట్టారు. 

ఈ 22 ఏళ్లలో నమోదైన 612 వర్షాలను పరిశీలిస్తే.. సగానికి పైగా సందర్భాల్లో (310 సార్లు) వర్షం తగ్గిన ఐదో రోజుకే గాలి మళ్లీ పూర్తిగా కలుషితమైపోయింది. ఎంత పెద్ద వర్షం పడినా పెద్దగా ఫలితం కనిపించడం లేదని అధ్యయనం పేర్కొంది. వర్షం ఆగిపోగానే నగరంలో యథావిధిగా తిరిగే కార్లు, బైక్‌‌‌‌‌‌‌‌ల పొగ, ఫ్యాక్టరీల వ్యర్థాలు, నిర్మాణ పనుల వల్ల లేచే దుమ్ము నిరంతరం గాల్లో కలుస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. 

సీజన్ల వారీగా చూస్తే.. వర్షాకాలంలో వర్షం తగ్గాక కాలుష్యం మళ్లీ పెరగడానికి సగటున ఆరు రోజులు పడితే, ఎండాకాలం, చలికాలంలో కేవలం ఐదు రోజులే పడుతోంది. ఇక వర్షాలు పూర్తిగా తగ్గే సీజన్‌‌‌‌‌‌‌‌లోనైతే కేవలం మూడు రోజుల్లోనే గాలి మళ్లీ కలుషితమైపోతోంది. వర్షం పడితే గాలి దానంతట అదే బాగుపడుతుందని అనుకోవడం భ్రమేనని, వాహనాల పొగ, ఫ్యాక్టరీల ఉద్గారాలపై ప్రభుత్వాలు శాశ్వత నియంత్రణ చర్యలు తీసుకుంటేనే ఢిల్లీ వాసులకు స్వచ్ఛమైన గాలి దక్కుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.