పల్లె పల్లెకూ మాస్టర్ ప్లాన్! దేశంలోనే తొలిసారిగా గ్రామాల సమగ్రాభివృద్ధికి జీపీ–సాప్

పల్లె పల్లెకూ మాస్టర్ ప్లాన్! దేశంలోనే తొలిసారిగా గ్రామాల సమగ్రాభివృద్ధికి జీపీ–సాప్
  • ప్రతి గ్రామానికీ ప్రత్యేక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్
  • పనుల పర్యవేక్షణకు డాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డు
  • ఇప్పటికే 90 శాతం గ్రామాల్లో సమగ్ర వివరాల నమోదు 
  • నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు
  • ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని పల్లెల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. దేశంలోనే తొలిసారిగా ప్రతి గ్రామ పంచాయతీకి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (తెలంగాణ గ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంచాయతీ కాంప్రహెన్సివ్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాన్– జీపీ సాప్​) విధానాన్ని తీసుకొచ్చింది. గ్రామానికి సంబంధించిన సమగ్ర సమాచారం, ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల వివరాలు, చేపట్టిన పనులు, రాబోయే ఐదేండ్లలో చేపట్టాల్సిన ప్రాజెక్టులన్నింటినీ ఒకే వేదికపైకి తీసురానున్నది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అధికారులు ఈ విధానానికి రూపకల్పన చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ జీపీ సాప్ రూల్స్–2026ను ఖరారు చేస్తూ జీవో జారీ చేసింది.

గ్రామ సమగ్ర ప్రొఫైల్

గ్రామ ప్రాథమిక సమాచారం, జనాభా, కుటుంబాల స్థితిగతులు, ఉపాధి, ఇండ్ల పరిస్థితి, భూమిలేని నిరుపేద కూలీలు, పశుసంపద, ప్రభుత్వ ఆస్తులు, వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలతో డేటా రెడీ చేస్తారు. గ్రామ అవసరాలు, ప్రాధాన్యతలు, వచ్చే నిధులను అంచనా వేసి మధ్యకాలిక అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తారు. గతేడాది వచ్చిన నిధులు, ప్రస్తుత అంచనాలను పరిగణనలోకి తీసుకుని వాటికి 125 శాతం మేర ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేస్తారు.

ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులను నెలవారీగా పర్యవేక్షిస్తారు. ఏ పని ఎక్కడివరకు వచ్చింది? ఎందుకు ఆలస్యమవుతోంది? అనే సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ అవుతుంది. కాగా, గ్రామానికి సంబంధించిన వివరాల కోసం ఇకపై మండల, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రత్యేక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్, డాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డును అందుబాటులోకి తీసుకురానున్నారు. గ్రామ సమాచారం, జరుగుతున్న పనుల ప్రగతిని ప్రజలు, అధికారులు ఎక్కడినుంచైనా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూసే వెసులుబాటు కలుగుతుంది.

నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలా..

కుటుంబాల వివరాలు, పథకాల సమాచారాన్ని పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయాలి. ప్రతినెలా డేటాను అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ చేయాలి.  ఆయా శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమగ్ర వివరాలు అందించి, తుది ప్రణాళికపై సంతకాలు చేయాలి. మండలంలోని అన్ని జీపీల సమన్వయం, డేటా ఎంట్రీ ప్రక్రియను పర్యవేక్షించాలి. ప్రతినెలా పంచాయతీ సమావేశంలో మొదటి అజెండాగా జీపీ సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్చించి, పనుల ప్రగతిని సమీక్షించాలి. జిల్లాస్థాయిలో ప్రణాళిక అమలు, పనుల నాణ్యతను నిరంతరం మానిటరింగ్ చేయాలి.

తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం వివిధ శాఖల అధికారులు పంచాయతీ అడిగిన సమాచారాన్ని సెక్షన్ 127 ప్రకారం తప్పనిసరిగా అందించాలి. ఒకవేళ ఏ అధికారి అయినా నిర్లక్ష్యం వహించినా లేదా తప్పుడు లెక్కలు చూపించినా సెక్షన్ 135 ప్రకారం కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. కాగా, 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పాత్ర కీలకం. వ్యవసాయం, పశుసంపద, జీవనోపాధుల విస్తరణకు ఈ జీపీ సాప్ తోడ్పాటునందించనుంది. ఇప్పటికే కేంద్రం అమలు చేస్తున్న జీపీడీపీ, వీజీపీపీలను దీంతో అనుసంధానం చేసి, నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడమే ఈ విధానం అసలు ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా..!

ఇప్పటివరకు గ్రామాల్లో పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా, సెర్ప్, ఉపాధి హామీ (వీబీ జీ రామ్​ జీ) వంటి వివిధ శాఖలు తమ పరిధిలోని పనులకు వేర్వేరుగా ప్రణాళికలు వేసుకునేవి. దీంతో సమన్వయం లోపించి, నిధులు సక్రమంగా వినియోగం కాకపోయేవి. ఎక్కడ రోడ్డు అవసరం? ఎవరికి ఇల్లు కావాలి? ఏ ఊరికి తాగునీటి ఎద్దడి ఉంది? వంటి అంశాల్లో స్పష్టత ఉండేది కాదు. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం జీపీ సాప్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో వివరాల నమోదు ప్రక్రియ వేగంగా సాగుతుండగా, ఇప్పటికే 90 శాతం గ్రామాల్లో ప్రొఫైల్ తయారైంది.