- ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో టీజీ సేఫ్ తనిఖీలు
- 20 యూనిట్లలో సోదాలు.. 9 సంస్థల లైసెన్సులు సస్పెండ్
- రూ.5.89 లక్షల విలువైన 5,555 కిలోల సరుకులు సీజ్
హైదరాబాద్, వెలుగు: బొద్దింకలు, దోమలు, ఈగలు.. ఎలుకల మల విసర్జన.. తుప్పుపట్టిన యంత్రాలు.. మురుగు కాలువల పక్కనే తయారీ.. ఇలా అపరిశుభ్ర పరిస్థితుల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న యూనిట్లపై టీజీ సేఫ్ అధికారులు కొరడా ఝళిపించారు. ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మసాలాలు, వంటనూనెలు, పాల ఉత్పత్తులు, స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు తయారు చేసే 20 యూనిట్లలో 10 బృందాలుగా ఏర్పడిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా అపరిశుభ్ర వాతావరణం, లేబుల్స్ లేని నిల్వలు, గడువు ముగిసిన ముడిసరుకులను గుర్తించారు. వరంగల్‌లోని ఓ స్వీట్ తయారీ కేంద్రంలో మురుగు కాలువ పక్కనే స్వీట్లు తయారు చేస్తూ కాస్మెటిక్ గ్రేడ్ గులాబీ నీళ్లు వాడుతున్నట్లు గుర్తించారు. మరో బేకరీలో నాన్-ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ వినియోగిస్తుండగా, ఓ ఐస్‌క్రీమ్ యూనిట్‌లో గడువు ముగిసిన పాలు, ఓపెన్ డ్రైనేజీ ఉన్నట్లు తేల్చారు.
21 ఫుడ్ శాంపిల్స్ ల్యాబ్‌కు
తనిఖీల్లో కల్తీ అనుమానంతో 21 ఫుడ్ శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రూ.5.89 లక్షల విలువైన 5,555 కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేసి ధ్వంసం చేశారు. వరంగల్‌కు చెందిన హరిప్రియ ప్రొడక్ట్స్, దయానంద్ ఐస్‌క్రీమ్స్, రాజు ఘీ స్వీట్స్, శ్రీ కృష్ణ ఆయిల్ మిల్స్, రమేశ్ ఇండస్ట్రీస్, జియాన్ ఫుడ్స్, గొర్రెకుంట కృప బేకరీలతోపాటు షాద్‌నగర్‌లోని శ్రీ ఎస్‌ఎంపీ డెయిరీ, హనుమకొండలోని కపిల్ ఫుడ్స్ సహా మొత్తం 9 సంస్థల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేశారు.
వాటి తయారీని నిలిపివేయించారు. గంగ ఫుడ్ టెక్, జీపీఆర్ ఫుడ్స్, హెల్తీ హార్ట్, వర్ష స్పైసెస్, కరణి స్పైసెస్, మిఠాయివాలా, బెల్ బ్రాండ్, స్వాగత్ స్వీట్స్, మార్లూస్ ఫుడ్స్ సంస్థలకు పెనాల్టీల విధింపునకు సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లోపాలను సరిదిద్దుకోవాలని లక్ష్మి ఫుడ్స్, శివ తార ఫ్లోర్ మిల్లులకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు ఇచ్చారు.
