గ్లామర్ రోల్స్‌తో ఆకట్టుకునే రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడొక ఆసక్తికరమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి రాముడు, సీతగా నటిస్తున్న ‘రామాయణం’లో రకుల్ ప్రీత్ సింగ్.. జనస్థాన్ రాజకుమారి శూర్పణఖగా కనిపించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి మాట్లాడిన రకుల్.. శూర్పణఖపై తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది. సమాజం ఆమెను ఇప్పటివరకు తప్పుగా అర్థం చేసుకుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాను శూర్పణఖ పాత్రలో నటించడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయని రకుల్ చెప్పింది. భారతీయ సంస్కృతి, చరిత్రలోని గొప్ప విషయాలను అంతర్జాతీయ స్థాయి సినిమాతో ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం రావడం ఒక కారణమైతే.. మరో కారణం శూర్పణఖ పాత్రలోని సంక్లిష్టత అని చెప్పింది. రామాయణంలో మహాయుద్ధానికి కారణమైన ఈ పాత్రలో ఎన్నో కోణాలు ఉన్నాయని, అలాంటి విలక్షణమైన పాత్రలో నటించడం ఒక నటిగా తనకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని తెలియజేసింది.
అంతేకాదు.. శూర్పణఖ కథను కేవలం ఒకే ఒక్క సంఘటనతో గుర్తుపెట్టుకోకూడదని రకుల్ చెప్పుకొచ్చింది. నితేశ్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో యశ్ రావణుడిగా నటించగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు.
