జడ్చర్ల టౌన్, వెలుగు: వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి స్థలం చూపిస్తే నెల రోజుల్లో నిర్మిస్తానన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సవాల్‌కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. శుక్రవారం జడ్చర్ల అంబేద్కర్ కళాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. లక్ష్మారెడ్డిపై తనకు నమ్మకం లేదని, ముందుగా రూ.25 కోట్లతో హెల్త్ డిపార్ట్మెంట్ పేరిట డీడీ తీసి చూపిస్తే, పట్టణంలోని ఎంపీడీవో ఆఫీస్‌కు చెందిన 3.22 ఎకరాల భూమిని కేటాయించే బాధ్యత తనదని అన్నారు. 15 రోజుల్లో డీడీ చూపించాలని, లేనిపక్షంలో 16వ రోజు లక్ష్మారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. గతంలో ప్రభుత్వ భూమిలో ఆస్పత్రి నిర్మించి, సొంత నిధులతో స్థలం కొనుగోలు చేసినట్లు ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఆస్పత్రి నిర్మాణమైన అసైన్డ్ భూమి లబ్ధిదారులు తమకు ఒక్క రూపాయి కూడా అందలేదని, తమకు తెలియకుండానే భూమిని ఇతరుల పేర్లపై మార్చి ఆస్పత్రికి ఇచ్చారని మీడియాకు వివరించారన్నారు.
అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్, ఎన్వోసీ విషయంలో అప్పటి తహసీల్దార్ నోటీసులు ఇవ్వగా, మాజీ మంత్రి సోదరి సద్గుణ కోర్టును ఆశ్రయించలేదా అని ప్రశ్నించారు. ఆస్పత్రి పట్టణానికి దూరంగా ఉండటంతో ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడటం లేదన్నారు. ట్రామా కేర్ సెంటర్ నిర్మాణంపై లక్ష్మారెడ్డి అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు విషయంలో తాను తప్పుగా మాట్లాడలేదని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. నిధుల కొరత కారణంగా నియోజకవర్గాలకు ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేకపోతున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కూడా తెలిపారన్నారు. క్రమశిక్షణ సంఘం నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని పేర్కొన్నారు.
