మోడల్ స్కూళ్లు ఇక తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ..ఒకే క్యాంపస్‌‌లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ దాకా 

మోడల్ స్కూళ్లు ఇక తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ..ఒకే క్యాంపస్‌‌లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ దాకా 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లను సమగ్రమైన తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రామీణ, విద్యాపరంగా వెనుకబడిన మండలాల్లోని నిరుపేద విద్యార్థులకు ఒకే క్యాంపస్‌‌లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 6వ తరగతి నుంచి ఇంటర్‌‌ వరకే నడుస్తున్న 194 మోడల్ స్కూళ్లలో కొత్తగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. 

రూ.205 కోట్లతో పాత భవనాల మరమ్మతులు

రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లను పూర్తిస్థాయి పబ్లిక్ స్కూళ్లుగా తీర్చిదిద్దడంతో పాటు ప్రైమరీ తరగతులను ప్రారంభించనున్నారు.ఇందులో భాగంగా ఒక్కో స్కూల్‌‌లో 10 అదనపు గదుల నిర్మాణంతో పాటు డ్యూయల్ డెస్క్ బెంచీలు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, తాగునీరు, డిజిటల్ లెర్నింగ్ ఎయిడ్స్, లైబ్రరీలు, క్రీడా సామగ్రి వంటి వసతులు కల్పించనున్నారు. ఒక్కో పాఠశాలకు రూ.3 కోట్ల చొప్పున మొత్తం రూ.582 కోట్లు కేటాయించాలని నివేదికలో ప్రతిపాదించారు. 

అలాగే రాష్ట్రవ్యాప్తంగా 105 మోడల్ స్కూళ్లలో అర్ధాంతరంగా ఆగిపోయిన, ప్రారంభంకాని అదనపు బ్లాకుల నిర్మాణాల పూర్తికి సుమారు రూ.117.84 కోట్లు అవసరమని తేల్చారు. దీనికి తోడు పాత భవనాల మరమ్మతులు, సైన్స్ ల్యాబ్ ప్లాట్‌‌ఫామ్‌‌లు, డ్రైనేజీ వ్యవస్థల పునరుద్ధరణ, బాలికల హాస్టళ్లు, ప్రహరీ గోడలు, ఆట స్థలాలు, సోలార్ పవర్ ప్లాంట్ల పనుల కోసం ఒక్కో బడికి సగటున రూ.1.95 కోట్ల చొప్పున మొత్తం రూ.205.54 కోట్లు కేటాయించాలని స్పష్టం చేశారు. తద్వారా మోడల్ స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయి మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. 

ఏ స్కూల్ కు ఎన్ని నిధులంటే..!

రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల అభివృద్ధి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.787.54 కోట్లు కాగా.. ఇందులో 70% నిధులను (రూ.551.278)కోట్లు,  ఆసియా ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌‌మెంట్ బ్యాంక్  (ఏఐఐబీ) నుంచి రుణంగా, మిగతా 30 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేదా సీఎస్ఆర్ నిధుల (రూ.236.262) నుంచి  సేకరించనున్నారు. ఈ ఇంజినీరింగ్ పనులన్నింటినీ క్వాలిటీ కంట్రోల్ ప్రమాణాలతో ‘టీజీఈడబ్ల్యూఐడీసీ’ (తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ )ద్వారా ఈ-టెండర్ల పద్ధతిలో నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది.