ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌పై కివీస్ ఘన విజయం

ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌పై కివీస్ ఘన విజయం
  •     గ్లెన్‌‌ ఫిలిప్స్‌‌ సూపర్‌‌ సెంచరీ
  •     రాణించిన బ్రాస్‌‌వెల్‌‌, డఫీ 

ఆక్లాండ్‌‌: టీ20 సిరీస్‌‌ను చేజార్చుకున్న న్యూజిలాండ్‌‌ ఎట్టకేలకు గెలుపు బోణీ చేసింది. గ్లెన్‌‌ ఫిలిప్స్‌‌ (49 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 10 సిక్స్‌‌లతో 107) మెరుపు బ్యాటింగ్‌‌కు తోడు జాకబ్‌‌ డఫీ (4/23) బౌలింగ్‌‌లో చెలరేగడంతో... శుక్రవారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌‌లో కివీస్‌‌ 87 రన్స్‌‌ భారీ తేడాతో ఇండియాపై విజయం సాధించింది. దాంతో ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో టీమిండియా ఆధిక్యాన్ని 3–1కి తగ్గించింది. టాస్‌‌ ఓడిన న్యూజిలాండ్‌‌ 20 ఓవర్లలో 259/7 స్కోరు చేసింది. షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో ఇండియాపై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. మైకేల్‌‌ బ్రాస్‌‌వెల్‌‌ (25 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 6 సిక్స్‌‌లతో 65) రాణించాడు. ఛేజింగ్‌‌లో ఇండియా 20 ఓవర్లలో 172/9 స్కోరుకే పరిమితమైంది. తిలక్‌‌ వర్మ (35) టాప్‌‌ స్కోరర్‌‌. గ్లెన్‌‌ ఫిలిప్స్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టీ20 ఆదివారం హామిల్టన్‌‌లో జరుగుతుంది. 

41 బాల్స్‌‌లో 115 రన్స్‌‌.


ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన కివీస్‌‌ను ఆరంభంలో ఇండియా బౌలర్లు బాగానే కట్టడి చేశారు. మయాంక్‌‌ యాదవ్‌‌ (3/48) తన తొలి రెండు ఓవర్లలో వరుసగా టిమ్‌‌ సీఫెర్ట్‌‌ (3), డారిల్‌‌ మిచెల్‌‌ (24)ను ఔట్‌‌ చేశాడు. 34/2తో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌‌ను ఫిలిప్స్‌‌ సూపర్‌‌ సెంచరీతో అద్భుతంగా నిర్మించాడు. ప్రిన్స్‌‌ యాదవ్‌‌ను టార్గెట్‌‌ చేసి ఓ సిక్సర్‌‌, రెండు ఫోర్లతో టచ్‌‌లోకి వచ్చిన ఫిలిప్స్‌‌ తర్వాత నితీష్‌‌ బౌలింగ్‌‌ను ఉతికేశాడు. రెండో ఎండ్‌‌లో ఫిన్‌‌ అలెన్‌‌ (31) కూడా దీటుగా ఆడటంతో మూడో వికెట్‌‌కు 59 రన్స్‌‌ జతయ్యాయి. ఈ క్రమంలో 31 బాల్స్‌‌లోనే హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసిన ఫిలిప్స్‌‌.. నితీష్‌‌ వేసిన ఓవర్‌‌లో ఫోర్‌‌, నాలుగు సిక్సర్లతో 32 రన్స్‌‌ దంచాడు.

బెవాన్‌‌ జాకబ్స్‌‌ (7) నిరాశపరచడంతో స్కోరు 112/4గా మారింది. ఇక్కడి నుంచి బ్రాస్‌‌వెల్‌‌ ఇండియా బౌలింగ్‌‌పై పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. ఫిలిప్స్‌‌ కంటే ప్రమాదకరంగా బ్యాటింగ్‌‌ చేస్తూ అక్షర్‌‌ పటేల్‌‌ బౌలింగ్‌‌లో వరుసగా 4, 4, 4, 6తో 18 బాల్స్‌‌లోనే హాఫ్‌‌ సెంచరీ అందుకున్నాడు. చివరకు 18వ ఓవర్‌‌లో ప్రిన్స్‌‌ యాదవ్‌‌ (1/49) బౌలింగ్‌‌లో ఎల్బీ కావడంతో ఐదో వికెట్‌‌కు 41 బాల్స్‌‌లో 115 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. స్కోరు 227/5కు పెరిగింది. ఇక్కడి నుంచి మరింత దూకుడుగా ఆడిన ఫిలిప్స్‌‌.. అర్ష్‌‌దీప్‌‌ బౌలింగ్‌‌ స్ట్రెయిట్‌‌ సిక్సర్‌‌తో 46 బాల్స్‌‌లో సెంచరీ సాధించాడు. 15 బాల్స్‌‌లోనే రెండో ఫిఫ్టీ రన్స్‌‌ రాబట్టాడు. చివర్లో శాంట్నర్ (5)ను ఔట్‌‌ చేసిన అర్ష్‌‌దీప్‌‌ 150వ వికెట్‌‌ను ఖాతాలో వేసుకున్నాడు. 

డఫీ సూపర్‌‌ బౌలింగ్‌‌..

ఛేజింగ్‌‌లో ఇండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌‌లో ఐదు బాల్స్‌‌ తేడాలో శాంసన్‌‌ (4), ఇషాన్‌‌ కిషన్‌‌ (0)ను ఔట్‌‌ చేసి డఫీ సూపర్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చాడు. 4/2తో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌‌ను మిగతా బ్యాటర్లు గట్టెక్కించలేకపోయారు. అభిషేక్‌‌ శర్మ (27), శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (22) బ్యాట్లు ఝుళిపించినా వికెట్లు కాపాడుకోలేకపోయారు. ఐదో ఓవర్‌‌లో మాథ్యూ ఫిషర్‌‌ (2/40) వేసిన బాల్‌‌ను గట్టిగా కొట్టిన అభిషేక్‌‌ కవర్స్‌‌లో శాంట్నర్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. తర్వాతి ఓవర్‌‌లో ఆడమ్‌‌ మిల్నే (1/35) వేసిన స్పీడ్‌‌ బాల్​ శ్రేయస్​ వికెట్లను పడగొట్టింది.

దాంతో మూడో వికెట్‌‌కు 46 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఫలితంగా ఇండియా 61/4 స్కోరుతో పవర్‌‌ప్లేను ముగించింది. ఇక్కడి నుంచి పొదుపుగా బౌలింగ్‌‌ చేసిన శాంట్నర్‌‌ (2/23) పవర్‌‌ప్లే తర్వాత రన్స్‌‌ను నిరోధించాడు. అక్షర్‌‌ పటేల్‌‌ (7), నితీష్‌‌ కుమార్‌‌ (21) నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా సక్సెస్‌‌ కాలేదు. 9వ ఓవర్‌‌లో నాలుగు బాల్స్‌‌ తేడాలో శాంట్నర్‌‌ ఈ ఇద్దర్ని పెవిలియన్‌‌కు పంపాడు. ఐదో వికెట్‌‌కు 30 రన్స్‌‌ జతయ్యాయి. తిలక్‌‌తో కలిసి నమన్‌‌ ధీర్‌‌ (28) కివీస్‌‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగినా అప్పటికే రన్‌‌రేట్‌‌ భారీగా పెరిగిపోయింది. 12వ ఓవర్‌‌లో డఫీ.. నమన్‌‌తో పాటు అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌ (0)ను ఔట్‌‌ చేయడంతో ఇండియా స్కోరు 121/8గా మారింది. చివర్లో ప్రిన్స్‌‌ యాదవ్‌‌ (18 నాటౌట్‌‌) మెరుగ్గా ఆడినా.. 19వ ఓవర్‌‌లో తిలక్‌‌ ఔట్‌‌తో ఇండియాకు ఓటమి తప్పలేదు.

 సంక్షిప్త స్కోర్లు

న్యూజిలాండ్‌‌: 20 ఓవర్లలో 259/7 (ఫిలిప్స్‌‌ 107, బ్రాస్‌‌వెల్‌‌ 65, మయాంక్‌‌ 3/48). ఇండియా: 20 ఓవర్లలో 172/9 (తిలక్‌‌ 35, డఫీ 4/23). 
 
అర్ష్​దీప్​ @ 150

ఈ మ్యాచ్‌‌లో ఒక్క వికెట్‌‌ తీసిన అర్ష్‌‌దీప్‌‌ రెండు రికార్డులను నమోదు చేశాడు.  ఇండియా తరఫున 150 వికెట్ల మైలురాయిని (103 మ్యాచ్‌‌లు) అందుకున్న తొలి బౌలర్‌‌గా నిలిచాడు. ఇందుకోసం అర్ష్‌‌దీప్‌‌ 2143 బాల్స్‌‌ వేశాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్‌‌ను సాధించిన ఫాస్ట్‌‌ బౌలర్‌‌గా రికార్డులకెక్కాడు. ముస్తాఫిజుర్‌‌ రెహమాన్‌‌ (2532 బాల్స్‌‌)ను అధిగమిం చాడు. లంక స్పిన్నర్‌‌ వానిందు హసరంగ (2035) ముందున్నాడు. ఇక అరంగే ట్రం చేసిన అతి తక్కువ రోజుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌‌ అర్ష్‌‌దీప్‌‌ (1577 రోజులు). హసరంగ (2325)ను వెనక్కి నెట్టాడు. ఒకే క్యాలెండర్‌‌ ఇయర్‌‌ అత్యధిక వికెట్లు (40) తీసిన బౌలర్‌‌గా అర్ష్‌‌దీప్‌‌.. జోష్‌‌ లిటిల్‌‌ (39) రికార్డును బ్రేక్‌‌ చేశాడు. 
 

ప్రసిధ్ దూరం.. సిరాజ్‌‌‌‌ ఎంట్రీ

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌‌తో వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌కు పేసర్‌‌ ప్రసిధ్‌‌ కృష్ణ దూరమయ్యాడు. వెస్టిండీస్‌‌తో జరిగిన వన్డే సిరీస్‌‌లో కండరాల గాయానికి గురైన ప్రసిధ్‌‌ ఇంకా మ్యాచ్‌‌ ఫిట్‌‌నెస్‌‌ సాధించలేదు. ఇక న్యూజిలాండ్‌‌–ఎ జట్టుతో శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండో అనధికార నాలుగు రోజుల మ్యాచ్‌‌ కోసం హైదరాబాదీ పేసర్‌‌ మహ్మద్‌‌ సిరాజ్‌‌ను ఇండియా–ఎ జట్టులో చేర్చారు. ఆల్‌‌రౌండర్‌‌ నితీష్‌‌ కుమార్‌‌ తొలి వన్డే వరకు టీమ్‌‌తో పాటు కొనసాగనున్నాడు. తర్వాత కివీస్‌‌–ఎతో జరిగే మూడో మ్యాచ్‌‌కు అందుబాటులో ఉండనున్నాడు.