- పనులు పూర్తిచేయడానికి కాంట్రాక్టర్‌కు రెండేండ్ల గడువు
- పదేండ్లపాటు నిర్వహణ బాధ్యతలిస్తూ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా రూ.7,360 కోట్ల భారీ ప్రాజెక్టు ద్వారా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను గోదావరి నీటితో నింపేందుకు ఉద్దేశించిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-–2 పనుల్లో ఒక కీలక అడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల నియామక తేదీ(డీవోఏ–డేట్ఆఫ్అపాయింట్మెంట్) ని 24 జూన్ 2026గా నోటిఫై చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఎండీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్ జీవో నంబర్ 971ని రిలీజ్చేశారు. కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇప్పటికే ఫైనాన్షియల్ క్లోజర్‌ను పూర్తి చేసి, ఎస్క్రో ఖాతా ఒప్పందం, సబ్‌స్టిట్యూషన్ ఒప్పందాలను సమర్పించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నియామక తేదీని ఖరారు చేసింది. కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం నిర్దేశిత గడువులోగా ఫైనాన్షియల్ క్లోజర్ ప్రక్రియ సక్రమంగా ముగిసేలా పర్యవేక్షించాలని, దీనిపై రిపోర్ట్ఇవ్వాలని జలమండలి ఎండీని ప్రభుత్వం ఆదేశించింది.
ప్యాకేజీ-2 లో చేపట్టే పనులివే..
ఈ ప్రాజెక్టు ద్వారా చేపట్టే పనుల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల గోదావరి నీటిని తరలిస్తారు. ఇందులో 17.5 టీఎంసీలను హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు, మిగిలిన 2.5 టీఎంసీలను మూసీ నది పునరుజ్జీవనానికి, జంట జలాశయాల అనుసంధానానికి వాడుతారు. అలాగే, ఘన్‌పూర్ నుంచి ఉస్మాన్‌సాగర్ వరకు 2,200 మి.మీ, ముత్తంగి వరకు 2,400 మి.మీ. ఎంఎస్ పంపింగ్ మెయిన్ పైప్‌లైన్లు వేయాలి.
కోకాపేట్ నుంచి ఉస్మాన్‌సాగర్ కండ్యూట్ వరకు ఓఆర్ఆర్ వెంట 3 వేల మి.మీ. పైప్‌లైన్, ఉస్మాన్‌సాగర్, -హిమాయత్ సాగర్ జలాశయాల అనుసంధానం కోసం 2,200 మి.మీ. ఎంఎస్ పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలి. ఘన్‌పూర్‌లో 80 ఎంఎల్ ఎంబీఆర్, 18 ఎంఎల్ రా వాటర్ రిజర్వాయర్, పంప్ హౌస్, సబ్‌స్టేషన్లను నిర్మించాలి.
ఉస్మాన్‌సాగర్ వద్ద 120 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, హిమాయత్ సాగర్ వద్ద 70 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణంతోపాటు వాటికి అనుబంధంగా పంప్ హౌస్‌లు, క్లియర్ వాటర్ పంపింగ్ మెయిన్ నిర్మించాలి. వీటి ఆపరేషన్ అండ్మెయింటెనెన్స్పనులు పదేండ్లపాటు కాంట్రాక్ట్ సంస్థే చూడాలని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది.
రూ.7,360 కోట్లకు పరిపాలనా అనుమతులు
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.7,360 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. పనులను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్) పద్ధతిలో చేపడుతున్నారు. ఇందులో ప్రభుత్వం 40 శాతం వాటాను భరిస్తుండగా, మిగిలిన 60 శాతం పెట్టుబడిని సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
ప్యాకేజీ-–2 కింద మంజూరైన పనులను టెండర్ద్వారా దక్కించుకున్న మెసర్స్ రామ్కీ- జీవీపీఆర్(జీవీ), హైదరాబాద్ సంస్థ పనుల నియామక తేదీ నుంచి రెండేండ్ల గడువులోగా పూర్తి చేయాలి. అగ్రిమెంట్ ప్రకారం.. కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రాజెక్టు నిర్మాణంతోపాటు పదేండ్ల నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకోవాలని సర్కారు ఆదేశించింది.
