వెలుగు స్పెషల్ ఓట్‌‌చోరీ’పై సమరం

వెలుగు స్పెషల్  ఓట్‌‌చోరీ’పై సమరం

‘ఓటు కేవలం వేలిపై  సిరా చుక్క కాదు..  ప్రజాస్వామ్య భవిష్యత్తుపై  ప్రజలు వేసే సంతకం!  ప్రతి ఓటు ఒక గొంతుక.. ప్రతి ఓటరు ఒక శక్తి.. ప్రతి ఓటు దేశ దిశను మార్చగల ఆయుధం! అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకూడదు. అప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన భరోసా! ఓటు హక్కుకు రక్షణ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యానికి మనుగడ. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉన్నప్పుడే ప్రజల తీర్పుకు గౌరవం! అయితే ఇప్పుడు దురదృష్టవశాత్తు  కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణికి ఎన్నికల సంఘంలో గంద‌‌‌‌ర‌‌‌‌గోళం కూడా తోడవడంతో  ఓటు హక్కుపై సర్వత్రా ఆందోళన నెలకొంది. 

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో  దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటు చోరీపై  ప్రజాపక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ ఢిల్లీ వేదికగా నవంబర్ 1న ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ పేరిట మహా సంగ్రామ్ ర్యాలీ నిర్వహిస్తుంది. ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు కల్పించడం, మరణించినవారి పేర్లు,  నకిలీ ఓట్లు,  ఒకటికంటే ఎక్కువ ఓటు కలిగి ఉంటే వాటిని తొలగించడం ఎన్నికల సంఘం బాధ్యత.  అయితే  వీటిని పారదర్శకంగా,  నిష్పాక్షికంగా తొలగించాల్సిన ఎన్నికల సంఘం ‘సర్‌‌‌‌’ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగిస్తూ దేశంలో బీజేపీ చేస్తున్న ‘ఓట్ చోరీ’కి సహకరించింది. 

దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఓటర్ల ముసాయిదా జాబితాల్లో పేర్లు లేకపోవడం, నోటీసులు, పత్రాల సమర్పణలో ఇబ్బందులు, ఓటు తొలగింపుపై వస్తున్న వివాదాలు ప్రజల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఓటర్ల జాబితాలో ప్రక్షాళన అవసరమే అయినా అర్హులైనవారు ఓటు కోల్పోకుండా చూడటం భారత ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత.  ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ‘సర్’ ప్రక్రియ గణాంకాలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఓట్లు తొలగించడం జరిగింది. 

ఇది గత ఓటర్ల సంఖ్యతో పోలిస్తే దాదాపు 14 శాతంపైనే.  భారీగా ఇన్ని పేర్లు తొలగిస్తున్నప్పుడు సక్రమంగా పరిశీలించారా? అర్హులైనవారు తిరిగి నమోదు చేసుకునేందుకు సులభతరమైన అవకాశం కల్పించారా? అనే ప్రశ్నలు సహజంగా తలెత్తుతున్నాయి.  2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ విధించడం, ఫారం-6, ఫారం-7లో గందరగోళం,  ఆన్‌‌‌‌లైన్  నమోదు ప్రక్రియలో సందేహాలు, ఉద్దేశపూర్వకంగా ఒకే సామాజిక వర్గం ఓట్ల తొలగింపు ఇలా ఇవన్నీ కలగలిపి చూస్తే ఎన్నికల సంఘం అధికారులు మోదీ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి వ్యవహరిస్తున్నట్టు  స్పష్టమవుతోంది. 

ఢిల్లీలో మహా సంగ్రామ్ ర్యాలీ

‘సర్’ ప్రక్రియతో  దేశవ్యాప్తంగా ఓటు చోరీ జరుగుతోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వివిధ వేదికలపై పలు రుజువులతో  నిరూపించారు.  సర్  ప్రక్రియలో పలు లోపాలపై ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లలో ఇద్దరు సుఖ్‌‌‌‌బీర్‌‌‌‌‌‌‌‌ సింగ్ సంధూ,  వివేక్ జోషి,  సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌తో విభేదించినట్టు  బయటికి రావడంతో ఓటుచోరీపై కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రశ్నలు సహజమైనవే అని నిరూపితమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఈసీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాడుతున్న దశలో ‘ఇండియా’ గ్రూప్‌‌‌‌లోని  ఇతర పక్షాలు, పలు ప్రజా సంఘాలు, విద్యార్థి,  యువజన సంఘాలు కలిసి రావడం ఆహ్వానించదగ్గ పరిణామం.  

దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపడుతున్న నిరసనలను మోదీ ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న దశలో కాంగ్రెస్ అన్ని పక్షాలను కలుపుకొని ‘సర్’ అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో మహా సంగ్రామ్ ర్యాలీకి పిలుపిచ్చింది.  దేశవ్యాప్తంగా చేపట్టిన ‘సర్’ ప్రక్రియతో గందరగోళం నెలకొంది.  ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌‌‌‌లో  2.89 కోట్లు,  బిహార్‌‌‌‌లో 65 లక్షలు,  మహారాష్ట్రలో 2.07 కోట్లు పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. 

పశ్చిమ బెంగాల్‌‌‌‌లో సుమారు 90.8 లక్షలు తొలగించగా,  అందులో 82 వేల అప్పీళ్లను పరిష్కరించిన ట్రిబ్యునల్ 75,339 పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని ఆదేశించింది. రాజధాని ఢిల్లీలో 47 లక్షలకు పైగా పేర్లు తొలగిపోగా, ఈ సంఖ్య అప్పటి ఓటర్లలో దాదాపు 32.8 శాతం కావడం ఆందోళనకరం.  మరణాలు, వలసలు, చిరునామా మార్పులు కారణాలలో పేర్లు తొలగిస్తున్నట్టు ఎన్నికల సంఘం చెబుతున్నా అప్పీళ్లలో పేర్ల పునరుద్ధరణకు ఆదేశాలు రావడం పలు సందేహాలను కలిగిస్తున్నాయి.

తెలంగాణలో 92 లక్షల మందికిపైగా నోటీసులు

తెలంగాణ విషయానికి వస్తే  గతంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, 92 లక్షల మందికిపైగా నోటీసులిచ్చారు.  దీనిపై  రాష్ట్ర  కాంగ్రెస్  ప్రజలను  జాగృతం చేస్తూ  క్షేత్రస్థాయిలో  బీఎల్‌‌‌‌ఏలను నియమించి అర్హులైన ఓటర్లకు  అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంది.  పాత  జాబితా 2002తో  వివరాలు సరిపోవడం లేదనే సాకుతో ఓటర్లను తిరస్కరించడం అశాస్త్రీయం. పూర్వీకుల వివరాలు, పాత చిరునామాలపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఓట్లను తొలగిస్తుండడంతో వారికి బాసటగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌‌‌‌’ (ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ) జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. పాత వివరాలు అందజేయడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓటర్లకు సంబంధించి  ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ ఆమోదించాలని  రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను ఈసీ  తిరస్కరించడం    దురదృష్టకరం.     బీజేపీ    తమ      వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నట్టు కాంగ్రెస్ చేస్తున్న వాదనలు తెలంగాణలో  నిరూపితమయ్యాయి. ఫారం-7 ద్వారా బీజేపీకి చెందిన బీఎల్ఏ భారీగా ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించగా హైదరాబాద్‌‌‌‌లో అతనిపై కేసు నమోదైంది. 

బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు

కొత్త ఓటర్ల నమోదు ఫారం-6లో డిక్లరేషన్‌కు సంబంధించిన మార్పులు, వాటి చట్టపరమైన ఆధారాలపై  పలు సందేహాలున్నాయి. ఫారం-6తోపాటు ఎన్నికల సంఘం వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో జరిగిన మార్పుల గురించి సుప్రీంకోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఫారం-6 ద్వారా నమోదు,  ఫారం-7 ద్వారా పేరు తొలగింపునకు సంబంధించిన అభ్యర్థనలు,  ఫారం-8 ద్వారా సవరణలు వంటి ప్రక్రియలను  ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించే బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది.  దరఖాస్తుల స్వీకరణ,  తిరస్కరణకు కారణాలు,  అప్పీళ్ల  గడువులపై సమగ్రమైన స్పష్టత ఉండాలి.  

గోవా ఓటర్ల జాబితాలో ఓటర్ల తొలగింపు విషయంలో సాఫ్ట్‌‌‌‌వేర్,  డేటా సరిపోలికలపై వచ్చిన వివాదాలు సాంకేతికతతోపాటు మానవీయ పరిశీలన కూడా అవసరమని గుర్తుచేస్తున్నాయి. అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని దురుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ స్వయం ప్రతిపత్తి హోదాగల ఎన్నికల సంఘాన్ని భ్రష్టు పట్టించింది.  మోదీ ప్రభుత్వం డిసెంబర్ 2023లో  కొత్త చట్టం తీసుకొచ్చి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నియామక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తొలగించి, ఆ స్థానంలో ఒక కేంద్ర కేబినెట్ మంత్రిని చేర్చి ఆనాడే  అధికారం కోసం కుట్రలకు తెరలేపింది. అనంతరం సీఈసీగా జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ను నియమించిన  బీజేపీ ప్రభుత్వం స‌‌‌‌ర్ పేరిట‌‌‌‌ అక్రమాలను ప్రారంభించింది.

 ‘ఓట్ బచావో..దేశ్ బచావో’ 

చట్టబద్ధంగా వ్యవహరిస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఎన్నికల సంఘం అధికార పార్టీ ఒత్తిడికి లొంగడంతో దేశంలో ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహసనంగా మారింది.  ఎన్నికల ప్రక్రియలో ఓటు హక్కు అంటే దాన్ని వినియోగించుకునే అవకాశం అర్హులందరికీ ఉండాలి. అర్హులైన ఏ ఒక్క ఓటరుకూ అన్యాయం జరగకుండా భరోసా కల్పించినప్పుడే ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం క‌‌‌‌లుగుతుంది. 

అదే ప్రజాస్వామ్యానికి నిజమైన రక్షణ. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలకు, అందుకు సహకరిస్తున్న సీఈసీ వైఖరికి నిరసనగా ‘ఓటు చోరీ’ని ఎండగడుతూ కాంగ్రెస్ నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీస్థాయిలో చేపడుతున్న ‘ఓట్ బచావో-... దేశ్ బచావో’ మహా సంగ్రామానికి అన్ని పార్టీలు,  ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతుగా కలిసి రావాలి. 

- బి.మహేశ్ కుమార్ గౌడ్, 
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.