హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమాలో మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించడంపై తెలంగాణ కార్మిక శాఖ (లేబర్ డిపార్ట్మెంట్) రంగంలోకి దిగింది. బాల కార్మిక చట్టాలు, నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై వివరణ ఇవ్వాలని సినిమా నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది.
జై లోక్ సత్తా సోషల్ జస్టిస్ ఫోరం చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఈ నోటీసులు ఇచ్చింది. మైనర్ బాలికను సినిమా షూటింగ్లో భాగం చేయడానికి జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారా? బాలిక తల్లిదండ్రుల సమ్మతి పొందారా? అనే అంశాలపై అధికారులు ప్రశ్నించారు.
అంతేకాకుండా బాలికకు సంబంధించిన కాల్షీట్లు, అటెండెన్స్ రికార్డులు, షూటింగ్లో పాల్గొన్న పని గంటల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. షూటింగ్ కారణంగా బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారా? ఆమె భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక బాధ్యుడిని నియమించారా? అనే వివరాలను కూడా కోరారు.
మైనర్ బాలికకు చెల్లించిన పారితోషికంలో కనీసం 20 శాతాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో జమ చేశారా? అనే అంశంపై కూడా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
సినిమా షూటింగ్‌కే పరిమితం కాకుండా ‘ఇరుముడి’ ప్రమోషనల్ కార్యక్రమాలు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లలోనూ మైనర్ బాలిక పాల్గొనడంపై అధికారులు వివరణ కోరారు. ఆయా కార్యక్రమాల్లో బాలిక పాల్గొనే విషయంలో నిబంధనలు పాటించారా? అనే అంశాన్ని స్పష్టం చేయాలని నిర్మాతలను ఆదేశించారు.
నవంబర్ 4న విచారణకు హాజరు కావాలని ఆదేశం
ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో నవంబర్ 4న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సినిమా నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. బాలల హక్కులు, భద్రత, విద్యకు సంబంధించిన నిబంధనల అమలుపై అధికారులు దృష్టి సారించారు.
ఆగస్టు 21న విడుదలైన ‘ఇరుముడి’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందడంతో పాటు మంచి వసూళ్లు సాధించి విజయవంతమైంది. సినిమా విజయానంతరం ఇప్పుడు మైనర్ బాలికతో షూటింగ్, ప్రమోషన్లలో పాల్గొనడం, కార్మిక చట్టాల అమలు అంశాలు హాట్ టాపిక్ గా మారాయి.
