దీపావళి టపాసుల షాపు కోసం రూ.65 వేలు లంచం : ఏసీబీకి అడ్డంగా దొరికిన ఫైర్ ఆఫీసర్

దీపావళి టపాసుల షాపు కోసం రూ.65 వేలు లంచం : ఏసీబీకి అడ్డంగా దొరికిన ఫైర్ ఆఫీసర్

రాజమండ్రి:  దీపావళి బాణాసంచా దుకాణాలకు ఫైర్ ఎన్‌ఓసీలు జారీ చేయడంతో పాటు తనిఖీల పేరుతో లంచం డిమాండ్ చేసిన అగ్నిమాపక శాఖ అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రాజమహేంద్రవరం సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి (ఏడీఎఫ్‌ఓ) పి. శ్రీనివాస్ రూ.65 వేల లంచం తీసుకుంటుండగా  ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఐదు దుకాణాలకు రూ.75 వేలు డిమాండ్

ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడు ఐదు బాణాసంచా దుకాణాలను నిర్వహిస్తున్నారు. ఆయా దుకాణాలకు సంబంధించిన PESO లైసెన్సులు 2028, 2035 సంవత్సరాల వరకు చెల్లుబాటులో ఉన్నాయి. అయితే రాబోయే దీపావళి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక దుకాణాలకు ఫైర్ ఎన్‌ఓసీలు జారీ చేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న దుకాణాలను తనిఖీ చేసేందుకు ఒక్కో దుకాణానికి రూ.15 వేల చొప్పున మొత్తం రూ.75 వేలు ఇవ్వాలని ఏడీఎఫ్‌ఓ శ్రీనివాస్ డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. చివరకు రూ.65 వేలు ఇచ్చేందుకు ఫిర్యాదుదారుడు అంగీకరించారు. అనంతరం ఏసీబీ రాజమహేంద్రవరం రేంజ్ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు వల పన్నారు.

అక్టోబర్ 27న సాయంత్రం 6.44 గంటలకు కోటిపల్లి బస్‌స్టాండ్ సమీపంలోని కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.65 వేల నగదు తీసుకుంటున్న సమయంలో శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్నారు.అనంతరం నిందితుడి కుడిచేతి వేళ్లకు నిర్వహించిన ఫినాఫ్తలీన్ పరీక్షలో పాజిటివ్‌గా వచ్చినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.

లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు లేదా ఏసీబీ రాజమహేంద్రవరం రేంజ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని అదనపు పోలీసు సూపరింటెండెంట్ విజ్ఞప్తి చేశారు.ఈ దాడిలో ఏసీబీ అదనపు ఎస్పీ ఎస్. భావ్య కిషోర్, ఇన్‌స్పెక్టర్లు ఎన్.వి. భాస్కరరావు, డి. వాసుకృష్ణ, వై. సతీష్, కె. గోవిందరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.