పేద యువతులే టార్గెట్..డబ్బు ఆశతో అండాల సేకరణ..వెలుగులోకి సంచలన విషయాలు

పేద యువతులే టార్గెట్..డబ్బు ఆశతో అండాల సేకరణ..వెలుగులోకి సంచలన విషయాలు

హైదరాబాద్: డబ్బు ఆశ చూపించి పేద యువతుల నుంచి అండాలు సేకరించి, వాటిని కార్పొరేట్ ఆసుపత్రులకు అధిక ధరలకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు హైదరాబాద్‌లో కలకలం రేపుతున్నాయి. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. పలు రాష్ట్రాలకు చెందిన పేదరికంలో ఉన్న యువతులకు డబ్బు ఆశ చూపించి హైదరాబాద్‌కు రప్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో శెట్టి వర్కింగ్ ఉమెన్స్ పేరుతో అద్దె హాస్టల్ ఏర్పాటు చేసి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

హాస్టల్‌లో ఉంటున్న యువతులకు నగదు ఆశ చూపించి నెలనెలా అండాలు సేకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా సేకరించిన అండాలను పలు  కార్పొరేట్ ఆసుపత్రులకు అధిక ధరలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కార్పొరేట్ ఆసుపత్రుల పాత్రపై ఆరా

ఈ వ్యవహారానికి సంబంధించి దుర్గాప్రసాద్‌ను సరూర్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతుల నుంచి అండాలను సేకరించేందుకు అవసరమైన చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా? అండాల సేకరణ, నిల్వ, సరఫరా ప్రక్రియలు నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయా? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.అండాలను స్వీకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రులకు సంబంధిత అనుమతులు ఉన్నాయా? ఈ వ్యవహారంలో ఆసుపత్రుల సిబ్బంది లేదా మరికొందరి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.