షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లీబిడ్డ మృతి చెందారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన రాధ అనే నిండు గర్భిణిని కుటుంబ సభ్యులు శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రసవం కోసం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
నార్మల్ డెలివరీ అవుతుందని, కొద్దిసేపు వేచి ఉండాలని వైద్య సిబ్బంది చెప్పడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రసవ నొప్పులు రావడానికి గ్లూకోజ్ ఎక్కించారని, అయితే గర్భంలోని శిశువు పరిస్థితి, తల్లి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహించారని బంధువులు ఆరోపించారు.
సాయంత్రం 5:30 గంటల వరకు సరైన వైద్యం అందించకుండా కాలయాపన చేశారని, చివరకు రాధ ఆరోగ్యం విషమించి నోటిలో నుంచి నురగలు రావడంతో ఆమె కుప్పకూలిపోయిందని తెలిపారు. ఆ సమయంలో ఆమెకు తీవ్రంగా ఫిట్స్ వస్తున్నాయని, ఇక్కడ చికిత్స అందించడం సాధ్యం కాదని చెప్పి హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారని ఆరోపించారు.
అయితే అప్పటికే షాద్‌నగర్ ఆసుపత్రిలోనే తల్లీబిడ్డ ఇద్దరూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన తర్వాత కూడా సీపీఆర్ చేసినట్లు నటించి ఘటన నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆరోపించారు.
మరోవైపు బాధిత కుటుంబానికి ప్రభుత్వ అత్యవసర అంబులెన్స్ సదుపాయం కూడా కల్పించలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ అంబులెన్స్‌కు రూ.9,000 చెల్లించి రాధను హైదరాబాద్‌కు తరలించామని బంధువులు తెలిపారు. అక్కడికి చేరుకున్న అనంతరం తల్లీబిడ్డ ఇద్దరూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు.
ఈ ఘటనకు బాధ్యులైన వైద్యులు, సంబంధిత సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
