IAS, IPS భార్యాభర్తలు : ఒక్కో విల్లాను రూ.15 లక్షల చొప్పున 18 విల్లాలు కొన్నారు.. ఓ రేంజ్ లో అధికార దుర్వినియోగం

IAS, IPS భార్యాభర్తలు : ఒక్కో విల్లాను రూ.15 లక్షల చొప్పున 18 విల్లాలు కొన్నారు.. ఓ రేంజ్ లో అధికార దుర్వినియోగం

ఇద్దరూ ఆఫీసర్లే.. ఒకరు IAS.. ఒకరు IPS.. నెలకు లక్షల్లో జీతం..అన్నింటికి మించి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఉన్నతాధికారులు. ప్రజలు, వారి ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వారే గాడి తప్పి అక్రమంగా ప్రజల సొమ్మును మింగి కోట్లలో ఆస్తులు కూడబెట్టుకుంటూ అధికారాన్ని ఏ రేంజ్ లో దుర్వినియోగం చేశారో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన 1993 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి శిఖర్ అగర్వాల్,అతని కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు ఆ రాష్ట్రరాజకీయాల్లో సంచలనంగా మారాయి.  అవినీతి నిరోధక శాఖ (ACB) ప్రాథమిక విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. 

శిఖర్ అగర్వాల్ (IAS) పరిశ్రమల శాఖ అదనపు ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో  అనంత బ్రాండ్ పేరుతో హోటళ్లు, రిసార్ట్‌లను నడిపే  గోయల్ ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీకి రూల్స్ బ్రేక్ చేసి భారీగా సబ్సిడీలు, పన్ను మినహాయింపులు, రాయితీ ప్యాకేజీలు అందించారని ఆరోపణలతో ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. 

 ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన రాయితీలకు  ప్రతిఫలంగా ఆయన, ఆయన భార్య ప్రశాఖ మాథుర్ (సీనియర్ ఐపీఎస్ అధికారి), వారి ఇద్దరు కుమారులు కలిసి ఉదయ్‌పూర్, అల్వార్‌లలోని ఆ సంస్థకు చెందిన రిసార్ట్‌లలో దాదాపు రూ.50 కోట్ల మార్కెట్ విలువ గల 40 విల్లాలను కేవలం అతి తక్కువ ధరకు రూ.6.16 కోట్లకే  పొందారని ప్రాథమిక విచారణలో తేలింది.

శిఖర్ అగర్వాల్ కు, ప్రైవేట్ కంపెనీకి మధ్య లీజ్ బ్యాక్ ఒప్పందంతో అవినీతి బాగోత బయడపడింది. విల్లాలు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే, తిరిగి అదే కంపెనీకి ఏడాదికి రూ.1.80 కోట్ల చొప్పున అద్దెకు లీజుకు ఇచ్చారు. అంటే పెట్టిన పెట్టుబడి కేవలం 3.5 ఏళ్లలోనే తిరిగి వచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు దర్యాప్తులో బయటికొచ్చింది.

ఇక శిఖర్ అగర్వాల్ కుటుంబం అవినీతి బాగోతం వెలుగు చూడటంతో రాజస్థాన్ ప్రభుత్వం అగర్వాల్ ను బాధ్యతల నుంచి తొలగించింది. అవినీతి నిరోధక కింద దర్యాప్తుకు ఆదేశించింది.