యూఎస్ ఒత్తిళ్లకు ఇందిరా తలొగ్గలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి

యూఎస్ ఒత్తిళ్లకు ఇందిరా తలొగ్గలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి ఒక దిశానిర్దేశం చేశారని, అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా భారతదేశ స్వతంత్ర నిర్ణయాధికారాన్ని కాపాడారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలను నేటి తరం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఢిల్లీలోని శక్తిస్థల్‌లో ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా ఒత్తిళ్లకు ఇందిరాగాంధీ ఎప్పుడూ తలొగ్గలేదని, భారత్ స్వతంత్రంగా వ్యవహరించే దేశంగా కొనసాగాలని ఆమె స్పష్టం చేశారని గుర్తుచేశారు.

ఇందిరాగాంధీ ప్రధానిగా దేశానికి ఒక ప్రత్యేక దిశను చూపించారని, 'గరీబీ హటావో' నినాదంతో పేదల ఆకలి తీర్చేందుకు కృషి చేశారని తెలిపారు. పేద ప్రజలకు అసైన్డ్ భూములు కేటాయించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించి వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని పేర్కొన్నారు. దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక శక్తిగా నిలిపేందుకు ఆమె కృషి చేశారని కొనియాడారు.

ప్రస్తుతం రాహుల్ గాంధీ కూడా ఇందిరాగాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో అమెరికా, రష్యా వంటి దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానం, ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని వివేక్ వెంకటస్వామి అన్నారు.