AK 47 Box Office Collection Day 1: 'ఆదర్శ కుటుంబం' ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్.. వెంకీ-త్రివిక్రమ్ కాంబోకు ఇది సరిపోతుందా?

AK 47 Box Office Collection Day 1: 'ఆదర్శ కుటుంబం' ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్.. వెంకీ-త్రివిక్రమ్ కాంబోకు ఇది సరిపోతుందా?

టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన హీరోగా నటించిన సినిమా కావడంతో 'ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47'పై మొదట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సినిమా రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. . చివరకు  అక్టోబర్ 30న థియేటర్లలోకి వచ్చింది.

తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది.  ఫస్టాఫ్‌లో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కొంతమేర ఆకట్టుకున్నప్పటికీ, సెకండాఫ్ నెమ్మదించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  విడుదల తేదీ  పలుమార్లు వాయిదా పడడం, క్రమంగా తగ్గిన బజ్ సినిమాపై ప్రభావం చూపించదన్న సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. వెంకటేష్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోపై ఉన్న అంచనాలు కాస్త తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సినీ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం..  'ఆదర్శ కుటుంబం’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.65 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు Sacnilk వెల్లడించింది. ఇందులో ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.9.50 కోట్లు కాగా, దేశీయ గ్రాస్ రూ.11.15 కోట్లుగా నమోదైంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ.5.50 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ప్రపంచవ్యాప్త వసూళ్లలో విదేశీ మార్కెట్ల వాటా ఏకంగా 33 శాతంగా ఉంది.

దేశీయంగా చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రూ.9.25 కోట్లతో ప్రధాన వాటాను రాబట్టింది. కర్ణాటకలో రూ.1.40 కోట్లు, తమిళనాడులో రూ.30 లక్షలు, కేరళలో రూ.2 లక్షలు, మిగతా ప్రాంతాల్లో రూ.18 లక్షలు వసూలైనట్లు సమాచారం. విడుదలకు ముందు అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో వెంకీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌కు ఈ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 అయితే వీకెండ్ వసూళ్లు మరింత పెరుగుతాయని మేకర్స్ ధీమాగా ఉన్నారు.  అంతే కాదు పెద్ద హీరోల చిత్రాలు కూడా లేకపోవడం మరింత కలిసివస్తుందన్న అభిప్రాయం చిత్రబృందం నుంచి వ్యక్తం అవుతోంది.. మరి శని, ఆదివారాల కలెక్షన్లు సినిమాకు ఎంతవరకు ఊపునిస్తాయి? మిక్స్‌డ్ టాక్‌ను అధిగమించి బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లోనే 'ఆదర్శ కుటుంబం' అసలు బాక్సాఫీస్ సత్తా తేలనుంది.