విద్యార్థులకు భద్రత కల్పించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'సబ్కో బీమా అభియాన్-2047' మిషన్‌లో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పించాలని కాలేజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. 2047 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికి లైఫ్, హెల్త్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ అద్భుతమైన పథకానికి రాజస్థాన్ యూనివర్సిటీ ఆదర్శంగా నిలిచింది. యూనివర్సిటీలో అలాగే దాని పరిధిలోని కాన్స్టిట్యూయంట్ కాలేజీల్లో చదువుతున్న 24వేల 900 మంది విద్యార్థులకు కేవలం రూ.100 వార్షిక ప్రీమియంతో రూ.14 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీని కల్పించారు. రాజస్థాన్ యూనివర్సిటీ అమలు చేసిన ఈ విజయవంతమైన మోడల్‌ను రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు విస్తరించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు కళాశాల ప్రిన్సిపాల్స్ అడ్మిషన్ ఫీజుతో పాటు ఈ ఇన్సూరెన్స్ ప్రీమియంను కూడా సేకరించి, సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీలతో సమన్వయం చేసుకోవాలని జిల్లా స్థాయి ఇన్సూరెన్స్ కమిటీ మెంబర్ సెక్రటరీ సరితా తెలిపారు. కేవలం వంద రూపాయలకే రూ.14 లక్షల వరకు ఇన్సూరెన్స్ రక్షణ లభించడం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని ఆమె అన్నారు. ఇప్పటికే జైపూర్‌లోని 5 విద్యాసంస్థల్లోని 5వేల364 మంది విద్యార్థులకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఈ కవరేజ్ అందించారు.
ప్రస్తుతం రాజస్థాన్‌లో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు లీడ్ ఇన్సూరర్లుగా వ్యవహరిస్తున్నాయి. కేవలం విద్యా సంస్థలే కాకుండా, అల్వార్ జిల్లాలోని దేసులా గ్రామంలో ప్రతి ఒక్క నివాసికి ఇన్సూరెన్స్ కల్పించామని, రాబోయే రోజుల్లో దీన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడికి విస్తరిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అందరి నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
