ప్రస్తుత ఐటీ రంగంలో ఫ్రెషర్లు, జూనియర్ ఉద్యోగులు జాబ్ సెక్యూరిటీ లేక టెన్షన్ పడుతున్నారు. లేఆఫ్స్ వల్ల ఉన్న ఉద్యోగం ఏ నిమిషాన ఊడిపోతుందో తెలియని ఆందోళనకర వాతావరణం నెలకొంది. మరోపక్క రోజురోజుకూ AI ముప్పు ఉద్యోగాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కానీ సరిగ్గా ఇందుకు పూర్తి భిన్నంగా ఐటీ ఇండస్ట్రీలో 40 ఏళ్లు దాటిన సీనియర్ పరిస్థితి ఉంది. అవును వాళ్ల జాబ్ కెరీర్ మాత్రం చాలా ప్రశాంతంగా, హాయిగా సాగిపోతోంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా కెరీర్ను ఆస్వాదిస్తున్నారు.
ప్రస్తుతం 40+ వయసులో సీనియర్ మేనేజర్లుగా, లీడర్షిప్ స్థానాల్లో స్థిరపడిన ఈ ఉద్యోగులు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వీరంతా పోటీ తక్కువగా ఉన్న గోల్డెన్ టైంలో ఐటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనగానే సమాజంలో ఎంతో గౌరవం ఉండేది. వీళ్ల సక్సెస్ చూసే ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంజనీరింగ్ చదివించి ఐటీ బాట పట్టించారు. నాటి అనుకూలమైన పరిస్థితుల వల్ల వీరు కెరీర్ ప్రారంభంలోనే అద్భుతమైన ప్యాకేజీలను అందుకుంటూ లైఫ్ కోసం చక్కటి సేవింగ్స్ సమకూర్చుకున్నారు కూడా.
ప్రస్తుతం కోటి రూపాయలకు పైగా జీతం తీసుకుంటూ, భారీగా కూడబెట్టిన సంపద, పటిష్టమైన పెట్టుబడులతో వీరు ఆర్థికంగా అత్యంత మంచి పొజిషన్ లో ఉన్నారు. ఒకవేళ ఉద్యోగ మార్పులు వచ్చినా లేదా చిన్నపాటి ఒడుదొడుకులు ఎదురైనా.. వీరికి వెనుక దాచుకున్న సేవింగ్స్ అండగా నిలుస్తాయి. అంతేకాకుండా ప్రస్తుతం కంపెనీల్లో కీలకమైన మేనేజ్మెంట్ స్థానాల్లో ఉండటం వల్ల ఏఐ టెక్నాలజీ లేదా లేఆఫ్స్ వీరిని పెద్దగా భయపెట్టలేకపోతున్నాయి. నిర్ణయాలు తీసుకునే అధికారంలో ఉండటం వీరికి రక్షణగా మారుతోంది.
అయితే 40 దాటిన ప్రతి ఐటీ ఉద్యోగి ఇలాగే ఆర్థికంగా సురక్షితంగా ఉన్నారని అనుకోవడం పొరబాటే. అనుభవం, కాలానికి తగినట్లుగా స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవడం, ముందుచూపుతో కూడిన ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోని వారి జీవితాలు పైన చెప్పినంత కూల్ ట్రాక్ లో నడవట్లే. సరిగ్గా ప్లాన్ చేసుకున్న సీనియర్లు మాత్రమే ప్రస్తుతం ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నారు. మొత్తానికి నేటి యువత పడుతున్న కెరీర్ కష్టాలను చూస్తుంటే.. అప్పట్లో సరైన సమయంలో ఐటీలోకి ఎంట్రీ ఇచ్చిన 40+ సీనియర్ల ప్రయాణం ఎంతో మందికి ఒక కలలా, చక్కటి సక్సెస్ స్టోరీలా కనిపిస్తోంది.
