ఇది ట్రోలింగ్ చేసే సమయమా.. : ఎలాన్ మస్క్‌పై విరుచుకుపడిన క్రిప్టో అధినేత

ఇది ట్రోలింగ్ చేసే సమయమా.. : ఎలాన్ మస్క్‌పై విరుచుకుపడిన క్రిప్టో అధినేత

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ బినాన్స్ పై రూ.60వేల కోట్ల భారీ సైబర్ అటాక్ జరిగిన సంగతి తెలిసిందే. కేవలం 20 నిమిషాల్లోనే హ్యాకర్లు ఈ భారీ మొత్తాన్ని దోచుకున్నారు. క్రిప్టో చరిత్రలోనే ఇది అతిపెద్ద హ్యాకింగ్ ఘటనగా నిలిచింది. దీనికి సంబంధించి దాదాపు సగం రూ. 30 వేల కోట్ల ఆస్తులను ఫ్రీజ్ చేయగా.. మిగతా నష్టాన్ని పూర్తిగా భరిస్తామని బినాన్స్ ప్రకటించింది. బినాన్స్ డెవ్‌ఆప్స్ ఇంజనీర్ ల్యాప్‌టాప్ హ్యాక్ కావడంతోనే ఈ ఘటన జరిగినట్లు కంపెనీ కో-సీఈఓ రిచర్డ్ టెంగ్ తెలిపారు.

ఈ భారీ నష్టంతో బినాన్స్ ఇబ్బందుల్లో పడగా.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్‌లో దీనిపై సెటైర్లు, జోకులు వేశారు. "ఎవ్రీడే ఈజ్ జీరోడే" అంటూ మస్క్ చేసిన పోస్టులు, నవ్వుతున్న ఎమోజీలు బినాన్స్ కంపెనీ వర్గాలను తీవ్రంగా నిరాశపరిచాయి. సంస్థ పెద్ద కష్టంలో ఉన్న సమయంలో బిజినెస్ మెన్ మస్క్ ఈ విధంగా ట్రోలర్‌తో పాటు చేరి వెక్కిరించడం అస్సలు సరైనది కాదని బినాన్స్ సహ వ్యవస్థాపకుడు అన్నారు.

మస్క్ తీరుపై బినాన్స్ కో-ఫౌండర్ చాంగ్‌పెంగ్ జావో స్పందిస్తూ, "ఎలాన్.. మీపై చాలా గౌరవం ఉంది, కానీ ఇది ట్రోల్ చేయడానికి సరైన సమయం కాదు. దయచేసి ఆపండి" అని కోరారు. గతంలో మస్క్ ఎక్స్‌ను కొనుగోలు చేసిన సమయంలో తాము రూ.4వేల100 కోట్లు పెట్టుబడిగా పెట్టామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ పెట్టుబడి విలువ ఇప్పుడు వేల కోట్లకు చేరిందని.. ఈ కష్ట సమయంలో కాస్త మద్దతు తెలపాలని సీజెడ్ విజ్ఞప్తి చేశారు.

అయితే ఈ నష్టాలను కవర్ చేయడానికి తమ కంపెనీ ఆదాయమే సరిపోతుందని బినాన్స్ కో-సీఈఓ యి హె స్పష్టం చేశారు. మస్క్ కంపెనీకి సంబంధించిన షేర్లను తాము అమ్మాల్సిన అవసరం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని.. హ్యాకింగ్ వల్ల జరిగిన నష్టంతో ఇన్వెస్టర్లు ఎలాంటి ఆందోళన చెందవద్దని బినాన్స్ యాజమాన్యం భరోసా ఇస్తోంది.