భారతీయ వివాహ వ్యవస్థలో అబ్బాయి చదువు, ఉద్యోగం, జీతం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం సాధారణ విషయమే. అయితే ఈ అర్హతలను అడ్టుపెట్టుకుని కొన్ని ఫ్యామిలీస్ చేసే డిమాండ్లు హద్దులు దాటుతున్నాయి. తాజాగా IIMలో చదువుకున్న ఓ యువకుడి కుటుంబం పెళ్లి ఖర్చుల పేరుతో ఏకంగా రూ.7 కోట్లు డిమాండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మల్లికా అహ్లువాలియా అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఈ ఉదంతం నెట్టింట దుమారం రేపింది.
మల్లికా అహ్లువాలియా తన స్నేహితురాలి తరఫున పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో ఈ చేదు అనుభవం ఎదురైందని చెప్పారు. మ్యారేజ్ బ్రోకర్ ద్వారా ఓ ఐఐఎం గ్రాడ్యుయేట్ అయిన యువకుడి కుటుంబం సంబంధం కోసం ముందుకు వచ్చింది. అయితే చర్చల్లోనే ఆ అబ్బాయి ఫ్యామిలీ పెళ్లి కోసం కనీసం రూ.7 కోట్లు ఖర్చు చేయాలని షరతు పెట్టిందట. ఈ డిమాండ్‌పై మల్లికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం డబ్బు గురించిన విషయం కాదని, అవతలి కుటుంబం నుంచి ఇంలాంటి డిమాండ్స్ చేసే తెగింపు(అడాసిటీ) ఎక్కడి నుంచి వస్తుందని ఆమె ప్రశ్నించారు.
దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో చదివిన వ్యక్తికి.. ఆయన కుటుంబానికి ఇంత సంకుచిత మనస్తత్వం ఉండటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు మల్లికా. అంత గొప్ప డిగ్రీ చదివి ప్రయోజనం ఏమిటి? చదువుకున్నా మీ ఆలోచనలు ఇంత వెనుకబడి ఉన్నాయా? అద్దంలో మీ మొఖం మీరే చూసుకోండి అంటూ ఘాటుగా విమర్శించారు. మ్యారేజ్ మార్కెట్లో పురుషులకే ఎక్కువ డిమాండ్ ఉండటంతో కొందరు ఇలా ప్రవర్తిస్తున్నారని, అమ్మాయిల కుటుంబాలు కూడా తిరగబడితే వీళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని ఆమె సెటైర్లు వేశారు. ఒక అత్యున్నత విద్యనభ్యసించిన పురుషుడు అంతే అర్హతలున్న మహిళను కోరుకోవడంలో తప్పు లేదు కానీ.. తన చదువును ఉపయోగించి ఒక కుటుంబాన్ని పీల్చి పిప్పి చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు 2 వర్గాలుగా విడిపోయి తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు అమ్మాయిలు కూడా ఇప్పటికీ మంచి ప్యాకేజీలు ఉన్న అబ్బాయిలనే కోరుకుంటున్నారని, బాగా ఆస్తులు ఉంటేనే తమ కూతురుని కట్టబెడతాం అంటూ అమ్మాయిల పేరెంట్స్ బేరసారాలు చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇరువైపులా ఉన్న వ్యక్తిగత ఎంపికేనని సమర్థించే ప్రయత్నం చేశారు. దీనికి మరో యూజర్ స్పందిస్తూ.. "ఒకవేళ అమ్మాయి ఐఐఎం లేదా ఐఐటీ చదివి అబ్బాయి కంటే ఎక్కువ సంపాదిస్తే.. అబ్బాయి కుటుంబాన్ని పెళ్లికి కోట్లు ఖర్చు పెట్టమని డిమాండ్ చేయగలదా? అలా చేస్తే సమాజం ఒప్పుకుంటుందా?" అని నిలదీశారు.
ALSO READ : ఇది ట్రోలింగ్ చేసే సమయమా.. : ఎలాన్ మస్క్‌పై విరుచుకుపడిన క్రిప్టో అధినేత
మరికొందరైతే ఐఐఎం గ్రాడ్యుయేట్ అయినంత మాత్రాన రూ.7 కోట్లు డిమాండ్ చేయడంపై సెటైర్లు పేల్చారు. "ఈ కుర్రాడు ఐఐఎం చదివింది వాల్యూ కోసం కాదు, సెకెండ్ హ్యాండ్ ఎయిర్‌బస్ లాగా కోట్ల రూపాయల రేటు కట్టించుకోవడానికేమో" అని ఎద్దేవా చేశారు. భారతదేశంలో కట్నం అడగడం చట్టరీత్యా నేరమని, దీన్ని కేవలం పర్సనల్ ఛాయిస్ గా సమర్థించడం సిగ్గుచేటని కొందరు అంటున్నారు. కేవలం డబ్బు డిమాండ్‌తో ఆగిపోకుండా, భవిష్యత్తులో ఈ వేధింపులు ప్రాణాల మీదికి తెస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెుత్తానికి పెళ్లికొడుకుల ఫ్యామిలీలు, పెళ్లి కూతుళ్ల ఫ్యామిలీల గొంతెమ్మకోరికల చిట్టా ఇండియాలో చాలా పెద్దదే అంటున్నారు సోషల్ మీడియా యూజర్లు.
