ప్రముఖ పంజాబీ సింగర్, నటుడు దిల్జిత్ దొసాంజ్ పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చీఫ్ అభిజీత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వేదికగా దొసాంజె వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి. అయినా అతనిపై అభిమానం తగ్గలేదు అని ఇన్ స్టాలో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత జూలో ఢిల్లీలో నీట్ అక్రమాలపై నిరసనలు జరుగుతున్న క్రమంలో దొసాంజె చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య చిన్న వివాదం నెలకొన్న సందర్భంగా తాజాగా దీప్కే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ప్రముఖ పంజాబీ సింగర్, నటుడు దిల్జిత్ దొసాంజ్, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చీఫ్ అభిజీత్ దీప్కే మధ్య వివాదం విద్యార్థుల నిరసనలకు మద్దతు ఇవ్వడంపై తలెత్తింది. నీట్ (NEET) పేపర్ లీకేజీ, పరీక్షల అక్రమాలపై జూలైలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద CJP ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల నిరసనల్లో పాల్గొంటారా అని ఓ ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో దిల్జిత్‌ను నెటిజన్లు ప్రశ్నించగా, నన్ను వీటికి దూరంగా ఉంచండి..నేను కేవలం ఒక కళాకారుడిని, రాజకీయ నాయకుడిని కాదు" అని సమాధానమిచ్చారు.
దిల్జిత్ సమాధానంపై అభిజీత్ దీప్కే తీవ్రంగా స్పందించారు. మరో పంజాబీ సింగర్ కాకా ఈ నిరసనలకు సంఘీభావం తెలపడంతో, దిల్జిత్‌ను ఉద్దేశించి దీప్కే సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.దేశానికి మీ అవసరం ఉన్నప్పుడు నేను కేవలం కళాకారుడిని అని చెప్పడం సరికాదు అంటూ దిల్జిత్‌ను విమర్శించారు.
అభిజిత్ దీప్కే వ్యాఖ్యలపై దిల్జిత్ దొసాంజే మరోసారి ఢిల్లివేదికగా స్పందించారు. అక్టోబర్ 30న జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్ స్టేజీపై నుంచి దిల్జిత్ దొసాంజ్ ఈ విమర్శలపై ఘాటుగా స్పందించారు. గతంలో విద్యార్థుల మార్చ్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నప్పుడు దిల్జిత్ విద్యార్థులకు అనుకూలంగా గళం విప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
దిల్జిత్ స్టేజీపై స్పందించిన తర్వాత, అభిజీత్ దీప్కే సానుకూలంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దిల్జిత్ పట్ల తనకున్న అభిమానం తగ్గలేదని చెబుతూ, చిన్న తమ్ముడిగా భావించి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని కోరుతూ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.
