హైదరాబాద్: మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం చోటుచేసుకుంది. ఓ కేసులో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి రూ.1.70 లక్షలను బంధువుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసిన ఆరోపణలపై కానిస్టేబుల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఓ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ నుంచి కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ నగదును బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సీజ్ చేసిన మొబైల్ ద్వారా రూ.1.70 లక్షలను తన బంధువులకు చెందిన బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
అదేవిధంగా, సదరు కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న 12 తులాల బంగారాన్ని సైతం కానిస్టేబుల్ తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన మీర్పేట్ పోలీసులు శ్రవణ్ కుమార్‌పై కేసు నమోదు చేశారు.
అనంతరం కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
