హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారుల నిర్లక్ష్యం,పలు శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రజాధనం వృథా అవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా ప్రారంభించిన మూసారంబాగ్ ఎత్తైన వంతెనపై నిర్మించిన ఫుట్ పాత్ ను కేబుల్ పనుల పేరుతో తవ్వేయడం చర్చనీయాంశంగా మారింది.
బ్రిడ్జి ప్రారంభమై కొన్ని నెలలు కూడా గడవకముందే పాదచారుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఫుట్ పాత్ ను కాంట్రాక్టర్లు తవ్వి ధ్వంసం చేశారు. కేబుల్ పనుల కోసం ఇటీవల ఈ తవ్వకాలు చేపట్టారు.. దీంతో కొత్తగా నిర్మించిన ఫుట్ పాత్ మార్గాలు గుంతలు, విరిగిపోయిన కాంక్రీట్ ముక్కలు, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయాయి.
రోజూ ఈ మార్గంలో ప్రయాణించే పాదచారులు నడవడానికి సరైన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో శిథిలాల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు వంతెన నిర్మాణం, మరోవైపు కేబుల్ పనులు.. సంబంధిత శాఖల మధ్య ముందస్తు సమన్వయం లేకపోవడంతో కొత్తగా వేసిన సీసీ రోడ్లను మళ్లీ తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని పౌరులు విమర్శిస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన మౌలిక సదుపాయాలను ఇలా ధ్వంసం చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ : రూ.300 ఇస్తే చాలు.. పుట్టిన తేదీ నుంచి పేరు, అడ్రస్ వరకు అన్నీ మార్చేస్తాడు !
తక్షణమే తవ్విన ప్రాంతాల్లోని శిథిలాలను తొలగించాలని, పాదచారులు సురక్షితంగా నడిచేలా మార్గాలను పునరుద్ధరించాలని జీహెచ్ఎంసీ అధికారులను స్థానికులు కోరుతున్నారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు, సంబంధిత ఏజెన్సీలను బాధ్యులను చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వారం రోజుల్లో పనులు పూర్తి చేస్తాం: జీహెచ్ఎంసీ
ఈ వ్యవహారంపై స్పందించిన జీహెచ్ఎంసీ సీనియర్ అధికారి ఒకరు.. మరో వారం రోజుల్లో కేబుల్ పనులు పూర్తవుతాయని తెలిపారు. తవ్విన ప్రాంతాలను సంబంధిత ఏజెన్సీ తిరిగి పునరుద్ధరిస్తుందని, పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
కాగా, మూసీ నదిపై నిర్మించిన మూసారంబాగ్ ఎత్తైన వంతెనను సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 31న అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభమైన కొద్ది నెలల్లోనే వంతెనపై పాదచారుల నడకదారులు తవ్వకాలకు గురికావడం నగరవాసుల దృష్టిని ఆకర్షిస్తోంది.
