మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. కురవి మండలం తిర్లాపురం గ్రామంలో విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ వ్యాన్ అదుపుతప్పి చెరువులోకి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా, మిగతా విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. కురవి మండల కేంద్రానికి చెందిన గీతాంజలి స్కూల్కు చెందిన వ్యాన్ 12 మంది విద్యార్థులతో పాఠశాలకు బయలుదేరింది. ఈ క్రమంలో తిర్లాపురం గ్రామం వద్ద వ్యాన్ డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడుపడంతో వ్యాన్ రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
వ్యాన్ చెరువులో పడటంతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చెరువులోకి దిగి విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్థానికులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మిగతా విద్యార్థులు సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
