నీతి కథ : రాజుకే జ్ణానోదయం చేసిన ఒక చెయ్యి లేని దివ్యాంగుడు.. నిజాయితీపరుడికి వరించిన వరాలు..!

నీతి కథ : రాజుకే జ్ణానోదయం చేసిన ఒక చెయ్యి లేని దివ్యాంగుడు.. నిజాయితీపరుడికి వరించిన వరాలు..!

మగధ  రాజ్యాన్ని విజయ సేన మహారాజు పరిపాలించేవాడు. పొరుగు రాజ్యాలు అన్నింటికన్నా మగధరాజ్యం చాలా చిన్నది. అయినా కూడా పాడి పంటల్లో ప్రతి ఏటా వర్షాలతో పచ్చగా వుండేది. అతి తక్కువ జనాభా గల రాజ్యం కాబట్టి విజయసేనుడు చక్కగా పాలిస్తూ వచ్చాడు. ప్రజలంతా ఉన్నంతలో బాగా బతుకుతున్నారు. పొరుగు రాజ్యాల రాజులు కూడా మగధరాజ్యాన్ని మెచ్చుకునేవాళ్లు.

ఇదిలా ఉండగా ఒకరోజు ఆస్థాన మంత్రిని రమ్మని కబురు పెట్టాడు మహారాజు. మహామంత్రీ... మన రాజ్యంలోని ప్రజలు కష్టాలు లేకుండా ఉన్నారు. కలిసిమెలిసి బతుకుతున్నారు. ఇంతకన్నా సంతోషం మరొకటి లేదు అన్నాడు విజయసేనుడు. దానికి అ మంత్రి అవును మహారాజా. అందరూ స్నేహ. పూర్వకంగా ఉన్నారు. కాబట్టే మన ఆస్థానంలోని న్యాయశాలకు ఏనాడూ తలుపులు తెరవాల్సిన పరిస్థితి రాలేదు అని బదులిచ్చాడు. వెంటనే ఆ రాజు.. చాలా సంతోషం కానీ నేను ఒక పని చేయాలనుకుంటున్నాను అనగానే ఆ మంత్రి చెప్పండి ప్రభూ అన్నారు.

మన రాజ్యంలో ఉన్న దివ్యాంగులకు ఒక్కొక్కరికి పది వరహాల చొప్పున పంచుదామని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు పని చేయలేరు కాబట్టి.. మీ అభిప్రాయం ఏంటి.. అన్నాడు ఆ మహారాజు. అంతకన్నా భాగ్యం ఏముంది మహారాజా.. అని సంతోషించారు మంత్రి. దీంతో రాజు మాట ప్రకారం రాజ్యంలో ఉన్న ప్రతీ గ్రామంలో దండోరా వేయించాడు. రాజ్యం చివర ఉన్న రణస్థలానికి అర్హులైన వారందరినీ రమ్మని చాటింపు వేయించారు.

అయితే పది వరహాలు అనగానే.. రాజ్యంలోని జనాభా మొత్తం అక్కడికే చేరుకుంది. అది చూసి ఆ మహారాజు ఆశ్చర్యపోయాడు. రాజ్యంలో ప్రతి ఇంట్లోను దివ్యాంగులు ఉన్నారంటే రాజు నమ్మలేకపోయాను. వరహాల కోసం నటిస్తున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారని ఆ మంత్రికి అర్ధం అయ్యింది. అయినా కూడా రాజు పది సరహాలు చొప్పున అందరికీ పంచమన్నాడు. తీసుకున్న వాళ్ళకు ఎడమ చేతి బొటన వేలుకి గుర్తు పెట్టి మరీ పంపించారు.

ఆ తర్వాత విజయసేనుడు చాలా బాధ పడతాడు. మహామంత్రీ. రాజ్యం సుభిక్షంగా ఉందని మనం భ్రమలో ఉన్నాం. తినడానికి లోటు లేదు. అయినా మనిషిలో అత్యాశ మాత్రం చావలేదు. పది వరహాలు అనగానే ప్రజలంతా వైకల్యం ఉన్నట్లు నటించారు. ఎంత దౌర్భాగ్యం ఇది. అసలు ఎందుకు మనిషి ఇలా తయారవుతున్నాడు? అని అడిగాడు. దానికి ఆ మహామంత్రి అవును మహారాజా ఎంత ఉన్నా ఇంకా కావాలనే ఆశ. మనిషితో చేయరాని పనులన్నీ చేయిస్తోంది అని చెప్పారు. 

ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందామనుకున్నా.. పోనీలే పది వరహాలే కదా అనుకున్నాను. సేనను రమ్మని చెప్పండి. ఎవరైతే చేతికి గుర్తు లేకుండా ఉంటారో వాళ్లే నిజమైన అత్యాశ లేనివాళ్లు.  దండోరా వేసిన క్షణంలోనే అంతమంది వచ్చారంటే నమ్మబుద్ధి కావట్లేదు. చేతిపై గుర్తు పెట్టించుకోని వారు ఎంతమంది వున్నారో నాకు లెక్క చెప్పండి అని పరివారాన్ని ఆజ్ఞాపించి పంపించారు.

ఆ వెంటనే పరివారమంతా రాజ్యంలో జల్లెడ పట్టింది. ఒక్క వ్యక్తి మాత్రమే గుర్తు పెట్టించుకోకపోవడంతో పరివారం ఆశ్చర్యపోయింది. ఇదే విషయాన్ని రాజు, మంత్రికి చెప్తే వాళ్లిద్దరూ నమ్మారు. అతనెవరో చూడాలనే కుతూహలంతో రాజే స్వయంగా ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు. రాజ్యం చివర ఒక పూరి గుడిసెలో ఒక పెద్దాయన కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ కనిపిస్తాడు. అతనికి ఎడమ చెయ్యి లేదు. ఒంటి చేత్తోనే పని చేసుకుంటున్నాడు. అతన్ని చూసి విజయసేనుడు.. పెద్దాయనా, నువ్వు వరహాల కోసం ఎందుకు రాలేదు. నీకు ఒక చేయి లేదు. దివ్యాంగుడివే కదా అన్నాడు. 

ఆ మాటకు పెద్దాయన గట్టిగా నవ్వి నేను దివ్యాంగుడిని అని ఎవరు అన్నారు. నేను నడవగలను, నా పని నేను చేసుకోగలను, వండుకుని తినగలను. నాకు వైకల్యం ఎక్కడుంది? లేదే! పని చేయడం ఇష్టం లేక బద్ధకంతో ఉన్న దివ్యాంగులు ఈ రాజ్యంలో చాలామంది ఉన్నారు. మీ పది వరహాలు వాళ్లకే ఇవ్వండి. నాకు అక్కర్లేదు అని చెప్పాడు. 

ఆ మాటలు వినేసరికి రాజు నిశ్చేష్టుడయ్యాడు. తన రాజ్యంలో ఒకే ఒక్కడు స్వార్థం లేకుండా ఉన్నాడని తెలిసి సంబరపడిపోయాడు. మహామంత్రీ... విధి వైపరీత్యం చూశావా. అత్యాశ పరులందరూ రాజ్యంలో వుంటే.. నిజాయితీగా బతికేవాడు ఎక్కడో బయట బతుకుతున్నాడు. వెంటనే ఇతనికి వెయ్యి వరహాలు ఇచ్చి రాజ్యం నడి బొడ్డున మంచి ఇల్లు కట్టివ్వండి.. అని ఆదేశించాడు విజయసేనుడు. ఇదంతా తెలిశాక  రాజు మంచితనాన్ని, ఆ పెద్దాయన నిజాయితీని మెచ్చుకోని వాళ్లు లేరు.