ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. 36 వేల మందితో భారీ పోలీసు బందోబస్తు!

ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. 36 వేల మందితో భారీ పోలీసు బందోబస్తు!

ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్దమైంది. రేపు (నవంబర్ 1) రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో ఇవాళ  పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులను ఎన్నికల సిబ్బందికి పంపిణీ చేశారు. 

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 4వేల372 పోలింగ్ కేంద్రాల పరిధిలో 36వేల 351 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వీటిలో 671 అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. మరో 1233 సమస్యాత్మక కేంద్రాల దగ్గర అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు 1,543 రూట్ మొబైల్ బృందాలను అందుబాటులో ఉంచారు. అలాగే 111 స్ట్రాంగ్ రూముల దగ్గర 4వేల655 మంది పోలీసులతో భద్రత కల్పించనున్నారు.

ALSO READ : ఏపీలో మళ్లీ వాయుగుండం పడింది

ఎన్నికలకు సంబంధించి నమోదైన కేసుల్లో ఇప్పటివరకు 107 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలింగ్‌లో ఏవైనా అవాంతరాలు ఏర్పడి అవసరమైతే నవంబర్ 2న రీపోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.