యలహంకలోని ఇంట్లో కూతురు పెళ్లి చేయాలన్న నా కోరిక నెరవేరడం లేదని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వివాహ వేదికపై వస్తున్న వివాదాల నేపథ్యంలో తన కూతురు వైఎస్ అంజిలి రెడ్డి పెళ్లిని యలహంక ఇంట్లో కాకుండా మరో ప్రదేశంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆస్తుల పంపకాలు జరిగాయని షర్మిల తెలిపారు. అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ ఆస్తుల పంపకాల్లో భాగంగా పూర్తిగా తనకు, తన పిల్లలకు వచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయం దేవుడి సాక్షిగా నిజమని ఆమె స్పష్టం చేశారు.
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరిగిన ఇల్లు కావడంతో పాటు, అది తన పిల్లల హక్కుగా వచ్చిన ఆస్తి కావడంతో అక్కడే కుమార్తె పెళ్లి చేయాలని భావించినట్లు షర్మిల తెలిపారు. తన కుమార్తె అంజిలి కూడా తాను పెరిగిన ఇంట్లోనే పెళ్లి జరగాలని కోరుకుందని చెప్పారు.
సొంత ఇంట్లో పిల్లల పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్నిచ్చే విషయమని, అయితే కుమార్తె కోరికను నెరవేర్చలేకపోతున్నామని బాధ వ్యక్తం చేశారు.
వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి తన కుమార్తె గురించి ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. అంజిలి పెళ్లి పెద్దలు కుదిర్చిన సంబంధమని, ఎలాంటి వివాదాలు, గొడవలు లేకుండా వివాహం జరిపించాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా మరో వేదికలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కాబోయే నూతన దంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని విజయమ్మ ఆకాంక్షించారు.
