గోల్డ్ రేట్ల క్రాష్‌కి చైనానే కారణమా..? బంగారం రేట్లు ఇంకెంత తగ్గుతాయ్?

గోల్డ్ రేట్ల క్రాష్‌కి చైనానే కారణమా..? బంగారం రేట్లు ఇంకెంత తగ్గుతాయ్?

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా పడిపోతూ పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జూలై తర్వాత కనిష్ట స్థాయిలకు పడిపోయిన బంగారం ధరలు.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం రేట్లు ఎందుకు తగ్గుతున్నాయనే విషయాలపై స్పష్టమైన వివరాలు తెలుసుకుందాం రండి..

వడ్డీ రేట్ల పెరుగుదల ఆశలు..
అమెరికాలో అంచనాలను మించి నమోదైన జీడీపీ గ్రోత్, సెప్టెంబర్‌ నెలలో పెరిగిన ద్రవ్యోల్బణం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే అంచనాలను బలపరిచాయి. మరోవైపు క్రూడాయిడ్ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ భయాలను పెంచింది. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఎలాంటి వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారంపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపరు. దీంతో బాండ్లు వంటి ఇతర వడ్డీనిచ్చే ఆస్తుల వైపు మొగ్గుచూపడంతో పసిడి ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

బంగారం రేట్ల క్రాష్ వెనుక చైనా లింక్.. 
బంగారం ధరల క్రాష్‌కు చైనాకు గట్టి సంబంధమే ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. చైనాలో ఆఫ్టర్‌షోర్ క్యాపిటల్ కట్టడిపై కొనసాగుతున్న ఉక్కుపాదంతో.. అక్కడి ఇన్వెస్టర్లు తమ లిక్విడిటీ అంటే డబ్బు అవసరాల కోసం తమ వద్ద ఉన్న బంగారాన్ని భారీగా అమ్మేస్తున్నట్లు స్విట్జర్లాండ్‌కు చెందిన వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ 'జూలియస్ బేర్' తన నివేదికలో పేర్కొంది. కేవలం కొత్త కొనుగోళ్లు నిలిచిపోవడమే కాకుండా, ఇప్పటికే ఉన్న నిల్వలను చైనా ఇన్వెస్టర్లు అమ్మేసి క్యాష్ చేసుకోవటం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోందట. అందుకే గోల్డ్ రేట్లు ఊహించని రీతిలో దిగొస్తున్నాయి.

ALSO READ : బంగారం, వెండి క్రాష్.. తులం రూ.3వేల 400 తగ్గిన గోల్డ్, కేజీకి రూ.10 వేలు తగ్గిన సిల్వర్!

షార్ట్‌టర్మ్‌లో గోల్డ్ రేట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, లాంగ్‌టర్మ్‌పై నిపుణులు సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు, సెంట్రల్ బ్యాంకుల గోల్డ్ షాపింగ్ బంగారానికి బలమైన మద్దతుగా నిలుస్తున్నాయి. రాబోయే కాలంలో ఫెడరల్ రిజర్వ్ మళ్లీ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటంతో పాటు, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గితే వచ్చే సంవత్సరంలో బంగారం ధరలు ఏకంగా 5వేల డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. సో ఇప్పుడు తగ్గినా గోల్డ్ రేట్లు మళ్లీ పెరుగుతాయన్నది పక్కాగా కనిపిస్తోంది. అందువల్ల రేట్ల తగ్గింపును షాపర్స్ వినియోగించుకోవటం మంచిది. ఇంకా రేట్లు తగ్గిపోతాయ్ అనే భ్రమలో వెయిట్ చేయటం కొంత ప్రమాదకరమే.