త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న 'పర్ణశాల' సినిమాలోని 'జిమ్ జిమ్ తార' పాటను 'ఆదర్శ కుటుంబం' చిత్రంలో ఉపయోగించడంపై టాలీవుడ్ లో దుమారం రేపుతోంది. తమ అనుమతి లేకుండానే తమ పాటను వాడేశారంటూ 'పర్ణశాల' నిర్మాత మంచి వెంకట్ అభ్యంతరం తెలిపారు. మా సినిమాకుఅన్యాయం చేయొద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
హీరో వెంకటేష్‌కు సంబంధించిన ఓ సన్నివేశంలో తమ సినిమా పాటను సుమారు 15 సెకన్ల పాటు వినియోగించారని మంచి వెంకట్ వెల్లడించారు. ఇంకా తమ సినిమా థియేటర్లలోకి రాకముందే ఇలా పాటను మరో చిత్రంలో చూపించడం వల్ల 'పర్ణశాల'కు భారీ నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల చేసిన ఈ పాటకు సంబంధించి అనుమతులు తీసుకోకుండా ఉపయోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
చిన్న సినిమాలను బతికించండి. అంటూ ఆయన చేసిన విజ్ఞప్తి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీస్తోంది. పెద్ద సినిమాల మధ్య చిన్న చిత్రాలు తమ ఉనికిని చాటుకోవడమే కష్టంగా మారిన సమయంలో ఇలాంటి పరిణామాలు మరింత ఇబ్బందికరమని ఆయన అభిప్రాయపడ్డారు.
'పర్ణశాల' చిత్రాన్ని ఎస్ఎల్టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై మంచి వెంకట్ నిర్మిస్తుండగా, వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రమోషన్లలో భాగంగా 'జిమ్ జిమ్ తార' పాటను లక్ష్మీదేవితో పాడించి చిత్రబృందం వినూత్న ప్రచారం చేపట్టింది. ఇప్పుడు అదే పాట చుట్టూ వివాదం నెలకొనడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మరి ఈ పాట వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుంది? మరి 'పర్ణశాల' నిర్మాత వెంకట్ అభ్యంతరాలపై 'ఆదర్శ కుటుంబం' మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
